Crude Oil Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Brent Crude Oil) ధర గత ఆరు వారాల్లో తొలిసారిగా బ్యారెల్‌కు 95 డాలర్ల మార్కును దాటింది. ప్రపంచ ఇంధన మార్కెట్ (Fuel Market) లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా సంబంధిత ఆందోళనలు, మారుతున్న డిమాండ్ పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ విశ్లేషకులు (Market Analysts) భావిస్తున్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిణామాలు, ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో సర్దుబాట్లు చేయడం వంటివి ధరల పెరుగుదలకు దారితీశాయి. ఇది చమురు మార్కెట్లలో మళ్లీ అస్థిరతను సూచిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగిస్తుండటంతో ప్రతిగా ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. దీనికితోడు యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు సౌదీకి సంబంధించిన నౌకలను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించడంతో ఆయిల్ ట్యాంకర్లు తమ రవాణా మార్గాలను మార్చుకుంటున్నాయి.
ముడి చమురు ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధనం దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఒపెక్+ దేశాలు తీసుకోబోయే నిర్ణయాలు, అంతర్జాతీయ ఆర్థిక సంకేతాలపై చమురు ధరల గమనం ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.