Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీగా నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల (IT Shares) లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికాలో జనవరి నెలకు సంబంధించి అంచనాల కంటే మెరుగైన జాబ్స్ డేటా (Jobs Data) రావడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. మెరుగైన జాబ్స్ డేటా వల్ల ఇప్పట్లో ఫెడ్ వడ్డీ రేట్లు (Fed Rates) తగ్గించకపోవచ్చన్న అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి.
దానికితోడు ఐటీ షేర్లను ఏఐ భయాలు వెంటాడాయి. ఇటీవల వరుస లాభాల వేళ గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ సూచీలపై ఒత్తిడి పెంచింది. ఐటీ స్టాక్స్‌ను ఆంథ్రోపిక్ భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. దీనికితోడు అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా కూడా ఐటీ షేర్లపై ప్రభావం చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే అమెరికన్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. దాంతో మన ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో నేడు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, విప్రో వంటి ఐటీ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చూశాయి.
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం మేర పతనమైంది. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు క్షీణించింది. సెన్సెక్స్ గురువారం ఉదయం 83,968.43 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,233.64) నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 83,516.67 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 558.72 పాయింట్ల నష్టంతో 83,674.92 వద్ద ముగిసింది.
నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.61గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, బీఈఎల్, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 5064 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.