Acid | నిశ్చితార్థం రద్దు చేసుకుందని యువతిపై కక్షపెంచుకున్న యువకుడు మొహంపై యాసిడ్ పోస్తా.. లేదా చంపేస్తా అని బెదరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఓ యువతి (33)హైదరాబాద్–వనస్థలిపురంలో ఉంటూ ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నది. ఆమెకు తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు డేటింగ్ యాప్ ద్వారా యువతికి దగ్గరయ్యాడు. తాను రొమ్ము క్యాన్సర్‌కు విరుగుడు ఔషధాలు కనిపెట్టేందుకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని, డబ్బులు కావాలని నమ్మించి రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరగగా, కట్నం మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలని వంశీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పి యువతి నిశ్చితార్థం రద్దు చేసుకుంది.
దీంతో వంశీ నిశ్చితార్థం రద్దు చేసుకుందని కోపంతో, ఆమె డ్రగ్స్‌కు బానిసైందని, ఆమె తమ్ముడు ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తాడని యువతి ఆఫీసుకు మెయిల్స్ పంపడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా, బయట కనిపిస్తే యాసిడ్ పోస్తానని లేదా చంపేస్తానని బెదిరించడంతో సదరు యువతి భయపడి ఇంట్లోనే ఉంటున్నది. జూన్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదని యువతి వాపోయింది. కాగా, ఈ నెల 4వ తేదీన యువతి తనను బెదిరిస్తుందని వంశీ తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యువతిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తన వాదన వినకుండానే తిరుపతి పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, 5వ తేదీన వనస్థలిపురంలోయువతి ఫిర్యాదు చేసింది.