Kanpur : నోయిడాలో రోడ్డుపై తవ్విన గుంటలో పడి ఒక వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే యూపీలోని కాన్పూర్ సమీపంలో మరో ఘటన జరిగింది. రోడ్డు మీద ఉన్న బురదగుంటలో పడి ఒక బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు ఆ గుంటలో పడి 12 గంటలు బతికే ఉన్నాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. కాన్పూర్ రూరల్ ప్రాంతం, భవానిపూర్ గ్రామానికి చెందిన ధీరేంద్ర కుమార్ (25) వెల్డర్‌గా పని చేస్తున్నాడు.
పని ముగించుకుని మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి తిరిగి బైకుపై వెళ్తుండగా, రూరా-శివాలి రోడ్డులోని ఒక బురద గుంటలో పడిపోయాడు. ఈ మార్గంలో అప్పటికే చీకటి పడటం, స్ట్రీట్ లైట్లు లేకపోవడం కారణంగా అతడి బైకు అదుపుతప్పి పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోయాడు. ఆ గుంట చాలా లోతుగా ఉంది. బైకుతోపడి పోవడం వల్ల బురదలోంచి పైకి రావడానికి ప్రయత్నించిన కొద్దీ ఇంకా లోపలికి కూరుకుపోయాడు. ఈ మార్గంలో ఎక్కువ మంది రాత్రి పూట ప్రయాణించకపోవడం, ధీరేంద్ర కుమార్ అరుపులు ఎవరికీ వినిపించకపోవడం వల్ల అతడిని ఎవరూ గుర్తించలేకపోయారు. మరోవైపు అతడి కుటుంబ సభ్యులు అతడి కోసం రాత్రంతా వెతుకుతూనే ఉన్నారు. చివరకు ఉదయం ఆరు గంటల సమయంలో స్థానికులు బైక్ ఆధారంగా అతడిని గుర్తించారు.
అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అతడు బురదలోనే ఉండిపోయాడు. పైగా రాత్రంతా పది డిగ్రీల చలిలో వణికిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు కలిసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు తీవ్రంగా చలికి వణికిపోయి, గాయాలతో ఉన్నాడు. ఉదయం కొందరు అతడిపై నీళ్లు పోసి బురద తొలగించారు. తర్వాత వెచ్చగా ఉంచేందుకు మంట వెలిగించారు. అనంతరం అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఎవరైనా అతడిని ముందుగానే గుర్తించి ఉంటే బతికేవాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, ధీరేంద్ర మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.