గుండెపోటు…ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే వచ్చేది. కానీ.. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, తీరిక లేమి, ఉరుకులు పరుగుల జీవితం, పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు తదితర కారణాలతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సమస్యలు ఏర్పడటం, గుండెపోటు రావడం జరుగున్నది. మరో మాట చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వృద్ధుల కంటే యుక్త వయసు వారే ఎక్కువగా గుండెపోటుకు గురవుతుండటం విచారకరం. గుండెపోటు అనగానే సాధారణంగా ఛాతీలో తీవ్రమైన నొప్పి, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం లాంటి స్పష్టమైన లక్షణాలు గుర్తుకు వస్తాయి. అయితే ప్రతి గుండెపోటులో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని కచ్చితంగా చెప్పలేం.
కొందరిలో గుండెపోటు వచ్చినా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఈ విధంగా లక్షణాలు లేకుండా వచ్చే గుండెపోటునే వైద్య పరిభాషలో ‘సైలెంట్ హార్ట్ ఎటాక్ ’ లేదా ‘సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్’ అంటారు. లక్షణాలు స్వల్పంగా ఉండటం లేదా అసలు కనిపించకపోవడం వల్ల చాలామంది దాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చికిత్స ఆలస్యం కావడంతో గుండె కండరాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. అసలు ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి…? ఇది ఎలాంటి రోగుల్లో వస్తుంది…? ఈ నిశ్శబ్ద గుండెపోటుకు గల కారణాలేంటి…? దీని లక్షణాలు, నిర్ధరణ పద్ధతులు, చికిత్సా విధానం, ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె కండరాలకు నష్టం కలిగినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. సాధారణ గుండెపోటులో ఛాతీలో నొప్పి లాంటి స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ, సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో అలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అలసట, ఛాతీలో స్వల్పంగా అసౌకర్యం, అజీర్ణం, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. వీటిని గుండెపోటుకు సంబంధించిన సమస్యగా గుర్తించకుండా ఇతర అనారోగ్య సమస్యలుగా భ్రమపడే అవకాశాలు ఉంటాయి.

కారణం తెలియని అలసట: ఎలాంటి కారణం లేకుండానే రోజుల తరబడి నీరసంగా, అలసటగా అనిపించడం. ఛాతీలో స్వల్ప అసౌకర్యం: ఛాతీ, వీపు, మెడ లేదా దవడ ప్రాంతంలో స్వల్ప ఒత్తిడి లేదా అసౌకర్యం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: సాధారణ పనులు చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతిలో ఉన్నప్పుడే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. వికారం, అజీర్ణం: వికారం, అజీర్తి లాంటి గుండెకు సంబంధించిన ఇబ్బందులను జీర్ణకోశ సమస్యగా భ్రమపడే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు. తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి కొన్ని నిమిషాలకంటే ఎకువసేపు కొనసాగడం, అకారణంగా విపరీతమైన చెమటలు పట్టడం, గాఢంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం లేదా సృ్పహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అత్యవసర వైద్య సహాయం పొందాలి.
సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను గుర్తించేందుకు వైద్యులు ముందుగా రోగి ఆరోగ్య చరిత్ర, కుటుంబ చరిత్ర, ప్రమాద కారకాలు, గతంలో కనిపించిన లక్షణాలను పరిశీలిస్తారు. రోగి ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య లక్షణాల ఆధారంగా ఈ క్రింది ప్రాథమిక పరీక్షలు చేయిస్తారు.
సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను గుర్తించిన తర్వాత వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవడం కీలకం. వైద్యులు సూచించిన చికిత్సలో భాగంగా మందులు
తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఊరగాయాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ఫ్యాట్లు, ఉప్పు లాంటి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తకువ కొవ్వు ఉన్న ప్రొటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రతి రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవి బరువు పెరగకుండా చూడటంతోపాటు రక్తపోటు నియంత్రణకు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఒత్తిడి నియంత్రణలో మెడిటేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకని ప్రతి రోజు ధ్యానం, యోగా లాంటివి చేయాలి. వీటి వల్ల మానసిక, శారీరక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. పొగాకు, ధూమపానం మానేయాలి. ఇతరులు తాగే పొగకు కూడా దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీంతో పాటు పొగాకు ఉత్పత్తులకు, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.