అర్వపల్లి, సెప్టెంబర్ 29 : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ శివారులోని కొమ్మల ఆవాస గ్రామం మేడిబావి తండాకు చెందిన గిరిజన రైతు బానోత్ నాగు తన భూమి విషయంలో న్యాయం చేయాలని కోరాడు. మంగళవారం కొమ్మల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డిని ఆశ్రయించి, ఆయనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగు తన భూమి వివాదంపై ఆవేదన వ్యక్తం చేశాడు. కొమ్మల గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు రైతుల వద్ద సుమారు 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, తన పేరుతో పాటు అతడి భార్య పేరుపై తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై 2012-13 లో తాసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. హద్దులు వేరుగా ఉన్న తన భూమిని చూపించారని నాగు ఆరోపించాడు.
అయితే ఆ భూమి తన కబ్జాలోనే ఉందని, అందులో వరి పంట సాగు చేయగా కొందరు వచ్చి భూమి తమదంటూ బెదిరించి పంటను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమలాంటి గిరిజనుల భూముల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని నాగు ఆరోపించాడు. తన భూమిని న్యాయబద్ధంగా కొనుగోలు చేసి ఉంటే సర్వే, భూమిపై సమగ్ర విచారణకు తాను సిద్ధమని, సంబంధిత రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హద్దులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి తనకు న్యాయం చేయాలని నాగు డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.