సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ) : రాజధాని పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయగా..రాజధాని ఓట్లు 62.7 శాతంగా నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉండగా..రంగారెడ్డి జిల్లాలో 24,12,652, మేడ్చల్-మల్కాజిగిరిలో 19,07,564 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా రాజధానిలో సర్వే ముందు కోటి 14 లక్షల పైచిలుకు ఉండగా..డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం 71.15 లక్షలకు చేరింది. అంటే దాదాపు 43 లక్షల ఓట్లు ఏఎస్డీ ఓటర్లుగా ( ఏ-లేనివారు, ఎస్-వలస వెళ్లినవారు, డీ-మరణించినవారు) చేరారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులలో విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వలస ఓటర్లు అధికంగా ఉండటం వల్ల ఎస్ఐఆర్ ద్వారా ఈ ఓట్లన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలోనే ఓటర్ల సంఖ్య సేకరణ సవరించిన షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి డ్రాఫ్ట్( ముసాయిదా) ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేయగా..జిల్లా మొత్తం 27, 95,225 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండి. పురుష ఓటర్లు 13,86,536, మహిళా ఓటర్లు 14, 08,513, థర్డ్ జెండర్ ఓటర్లు 176, మొత్తం 1710 ప్రాంతాల్లో 4094 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఓటర్ల జాబితా పరిశీలన, ఆక్షేపణలకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా ప్రకటించారు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా కాపీలను ఈఆర్వో ఆఫీసులు, సంబంధిత పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఓటర్స్ హెల్ప్‌లైన్ ద్వారా ఓటర్లు తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చాన్నారు. వచ్చే సెప్టెంబరు 16వ తేదీ వరకు ఫారం 6, 7, 8 ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. వచ్చే నెల 16 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబరు 15వ తేదీ లోపు దరఖాస్తులకు పరిష్కారం, తుది ఓటర్ల జాబితా 2026 అక్టోబరు 19న ప్రకటిస్తామని వెల్లడించారు. అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు డ్రాఫ్ట్ రోల్స్, పోలింగ్ స్టేషన్ల వివరాలను హార్డ్ కాపీ, పెన్‌డ్రైవ్ రూపంలో అందజేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ స్పష్టం చేశారు.