జుట్టు సంరక్షణ అనగానే.. తలకు రాసుకునే నూనెలు, షాంపూలు, సీరమ్ల వైపే చూస్తారు. ఆ తర్వాత అమ్మమ్మల చిట్కాలు, ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే సూచనలూ పాటిస్తారు. అయితే, వీటికన్నా ముందుగా.. జీవనశైలి గురించి ఆలోచించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇటీవల ‘ట్రయా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించి.. జుట్టు ఆరోగ్యంపై ఒత్తిడి-నిద్రలేమి చూపుతున్న ప్రభావాన్ని బయటపెట్టారు. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల హెయిర్ టెస్ట్లు చేసి, వాటి ఫలితాలను విశ్లేషించారు. వీరిలో సగానికి పైగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
ప్రతి పదిమందిలో ముగ్గురు.. నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు కారణాల వల్లే జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నదని వారు అంటున్నారు. అదే సమయంలో భారతీయ పురుషుల జీవనశైలిపై కూడా చర్చకు దారితీశారు. జుట్టు అనేది మన శరీరంలో ఓ భాగం. దాని ఆరోగ్యం మనం తీసుకునే పోషకాహారం, హార్మోన్లు, జీవక్రియ (మెటబాలిజం), విశ్రాంతితోపాటు మన మనసులోని మానసిక ఒత్తిడి లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే.. వారి జుట్టుపై నూనెలు, షాంపూల కన్నా.. వారి దినచర్యే ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడి శరీరాన్ని ఎప్పుడూ ఆందోళనలోనే ఉంచుతుంది. దీనివల్ల హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. అవి జుట్టు పెరగడం, వాటి ఆరోగ్యానికి తీవ్రమైన అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా.. వెంట్రుకలు నిర్జీవమై, రాలిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా దాదాపు సగం మంది భారతీయులు ఒత్తిడితో సతమతం అవుతున్నట్లు తేలింది. అందులో హైదరాబాద్, చెన్నై, కోల్కతా, విజయవాడ, సేలం, కోయంబత్తూర్ లాంటి నగరాలు ముందువరసలో ఉన్నాయి.
శరీరం నిద్రలోనే తనను తాను రీచార్జ్ చేసుకుంటుంది. కణాల పునరుద్ధరణ, హార్మోన్ల నియంత్రణ, రోజంతా కలిగిన ఒత్తిడి నుంచి కోలుకోవడం లాంటివన్నీ నిద్రలోనే జరుగుతాయి. అయితే, నిద్రకు పదేపదే భంగం కలిగినప్పుడు.. ఈ పునరుద్ధరణ సమయం కూడా తగ్గిపోతుంది. దాని ప్రభావం జుట్టుపైనా కనిపిస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం.. 29.4 శాతం మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులోనూ హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ, విశాఖపట్నం నగరాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి.
ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే.. ఒత్తిడి-నిద్రలేమి ఎక్కువగా ఉన్న నగరాలు జాబితా సరిపోలుతున్నాయి. అయితే, ఇది కేవలం కాకతాళీయం కాదనీ, ఒత్తిడి-నిద్రలేమి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. జుట్టు సంరక్షణ అనేది.. కీలకమైన జీవనశైలితోనే మొదలవ్వాలి. నిద్ర, ఒత్తిడే తన జుట్టు ఆరోగ్యానికి ప్రధాన కారణాలని బాధితులు అర్థం చేసుకోవాలి. లేకుంటే ఎలాంటి ఉత్పత్తులు వాడినా.. ఏ వైద్యుడిని సంప్రదించినా పెద్దగా
ప్రయోజనం ఉండబోదు.