సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ అమలుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పార్కు చుట్టూ మొత్తం 13 లైన్ ఛేంజర్స్, 10 ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్ఫింగ్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వన్‌వే ట్రాఫిక్ విధానం దాదాపు రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని, వాహనదారులు కొత్త ట్రాఫిక్ విధానానికి సహకరించాలని జోయల్ డేవిస్ కోరారు. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల క్రమంలో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వన్‌వే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ ప్రయాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
హెచ్సిటీ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద వందశాతం, జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు వద్ద 80 శాతం మేర ప్రయాణ ఇబ్బందులు తొలుగుతాయని నగర సీపీ సజ్జనార్ తెలిపారు. వన్‌వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడానికి ముందు రెండుసార్లు పైలట్ ట్రయల్స్‌ను నిర్వహించామని, ఈ పరిశీలనలు, అనుభవాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసి ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాహనదారులకు మార్గనిర్దేశనం చేయడానికి ముఖ్యమైన ప్రదేశాల్లో 24/7 ట్రాఫిక్ విభాగం, పోలీసు సిబ్బందిని నియమించామని, ప్రయాణికులు సులభంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు వీలుగా గూగుల్‌మ్యాప్స్, నావిగేషన్ రూట్లలోనూ అవసరమైన మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.