Rejinthal | జహీరాబాద్, సెప్టెంబరు 28 : అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ శివారులోని సిద్ధి వినాయక ఆలయం ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో కాణిపాకంగా పేరొందిన ఈ స్వయంభు వినాయకుడిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే పలుచోట్ల నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు.
అంగారక చతుర్థి రోజున రేజింతల్ సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంగళవారం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భక్తుల రాకతో అల్లాదుర్గ్, మెటల్కుంట, జహీరాబాద్, బీదర్ ప్రధాన రహదారులు సందడిగా మారనున్నాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు అశోక్ రేజింతల్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు, తాగునీరు, అన్నదానం, వసతి సౌకర్యాలను సిద్ధం చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా అభిషేకం, గణపతి హవనం, స్వామివారి కల్యాణం, మహా హారతి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.
భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ కోరింది.