న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,021.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,624.48 కోట్ల లాభంతో పోలిస్తే 38 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. వాహన, వ్యవసాయ పరికరాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని మహీంద్రా గ్రూపు సీఈవో, ఎండీ అనీశ్ షా తెలిపారు.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.41,464.98 కోట్ల నుంచి రూ.51,579.95 కోట్లకు ఎగబాకినట్టు చెప్పారు. ఒక త్రైమాసికంలో రూ.50 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు రూ.37 వేల కోట్ల నుంచి రూ.41,464 కోట్లకు పెరిగాయని, అలాగే నూతన కార్మిక చట్టం అమల్లోకి తేవడంతో సంస్థపై రూ.292.94 కోట్ల అదనపు భారం పడిందన్నారు. గత త్రైమాసికంలో సంస్థ 3.02 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించగా, 1.5 లక్షల యూనిట్ల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించింది.