Awarapan 2 | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ కానుకగా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో పోటీగా బరిలోకి దిగిన సినిమాల కంటే ముందు వరుసలో నిలిచి తన జోరును కొనసాగిస్తోంది.
మొదటి రోజుతో పోలిస్తే శనివారం ఈ సినిమా కలెక్షన్స్ ఏకంగా 53 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 10,496 షోలతో ‘ఆవారాపన్ 2’ రెండవ రోజు రూ. 33.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లో భారతదేశంలో దీని నెట్ కలెక్షన్లు రూ. 55.75 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ. 66.90 కోట్లుగా నమోదయ్యాయి. కేవలం దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. శనివారం విదేశాల్లో సుమారు రూ. 3.50 కోట్లు రాబట్టగా, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ రూ. 6 కోట్లకు చేరింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ. 72.90 కోట్లకు చేరుకుని, రూ. 80 కోట్ల మైలురాయికి చేరువయ్యింది.
2007లో వచ్చిన కల్ట్ హిట్ ‘ఆవారాపన్’ చిత్రానికి ఇది సీక్వెల్గా వచ్చింది. మొదటి భాగం మొత్తం వసూలు చేసిన కలెక్షన్ల కంటే, ఈ సీక్వెల్ ఒక్క రోజులోనే దానికంటే సుమారు 27 రెట్లు అధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా పటాని, షబానా ఆజ్మీ, సువిందర్ విక్కీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆదివారం వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్స్ మరింత బలపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.