Filmmaker Anurag Kashyap | ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ జెన్జీ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. నక్సల్స్ అంతం అయ్యారు అనుకుంటే కొత్తగా దేశంలో ‘దిమాగీ నక్సల్’ తయారయ్యారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
యువతను ఉద్దేశించి ప్రధాని లాంటి వ్యక్తి ‘దిమాగీ నక్సల్’ (మెదడులో నక్సలైట్ భావాలు ఉన్నవారు) వంటి పదాలను ప్రయోగించడాన్ని అనురాగా ఎద్దేవా చేశారు. ఈ పెద్దలకి (నాయకులకి) నిజంగానే నేటి పిల్లలు అసలు అర్థం కారు. ‘దిమాగీ నక్సల్’ అని అనగానే ఏదో బ్రహ్మాస్త్రం వదిలేశామని వీరు భావిస్తుంటారు. అంకుల్.. అసలు నక్సల్ అంటే ఏమిటో పిల్లలకే తెలియదు! కేవలం రాజకీయ విమర్శలు చేయడంకంటే ముందు, పాఠ్యపుస్తకాల నుంచి తొలగించిన కీలకమైన పాఠ్యాంశాలను (చాప్టర్లను) మళ్లీ పుస్తకాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఆ పాఠాలు బోధించాలంటే ముందుగా మూతపడిన పాఠశాలలను పునరుద్ధరించాలని, దానికి తగిన ఉపాధ్యాయులను కూడా నియమించాలని ఆయన ప్రభుత్వానికి చురకలంటించారు.
ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు తనదైన శైలిలో కొన్ని సలహాలు కూడా ఇస్తూ.. నాదొక చిన్న సలహా.. మీరందరూ కొంచెం ‘థెరపీ’ చేయించుకోండి, అది చాలా చాలా అవసరం. ఆ తర్వాత, జనరేషన్-జీ (Gen Z) యువతను మభ్యపెట్టడానికి వారి భాషను కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారి దగ్గరకు వెళ్లాలంటే.. ముందుగా మీరు కూడా బాగా చదువుకున్నవారై ఉండాలి కదా అంటూ అనురాగ్ కశ్యప్ విమర్శించాడు.