రుద్రంపూర్, ఫిబ్రవరి 12 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో మరోసారి వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. దుమ్ము నియంత్రణ కోసం నీటిని స్ప్రే చేసే వాటర్ ట్యాంకర్ నంబర్–4లో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. గత నెల 31న వోల్వో వాహనంలో మంటలు చెలరేగిన ఘటన ఇంకా మరువక ముందే 15 రోజుల వ్యవధిలో మరో వాహనంలో మంటలు చెలరేగడం భద్రతా చర్యలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలిక హడావుడి చేయడం తప్ప శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఇప్పటికే చాలా వాహనాలకు ఫిట్నెస్ లేదని నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి అన్ని వాహనాల ఫిట్నెస్పై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రమాదాలకు కారణమైన కాంట్రాక్టర్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకుడికి సన్నిహితుడు కావడంతోనే చర్యల్లో అలసత్వం చూపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయని వారు అంటున్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.