హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): ఉన్నపళంగా సివిల్ సప్లయ్, విజిలెన్స్ దాడులకు దిగడంపై మిల్లుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 టెండర్ ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు వసూ లు చేయడమే ఈ దాడులకు ముఖ్య కారణమనే చర్చ జరుగుతున్నది. అయితే టెండర్ ధాన్యం బాకీ ఉన్న మిల్లులపై దాడులను సమర్థిస్తున్న మిల్లర్లు.. తాజా ధాన్యం తనిఖీలను వ్యతిరేకిస్తున్నారు. క్రాప్ ఇయర్ పూర్తికాకముందే ఎలా తనిఖీలు చేస్తారని, వివిధ కారణాలతో షార్టేజ్ ఉంటుందని, దాన్ని బూతద్దంలో చూపి కేసులు పెట్టడం సరికాదని ఆందోళన చెందుతున్నారు.
సివిల్ సప్లయ్‌కి బయట అప్పులు పుట్టడం లేదని తెలిసింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఒక్క ఎన్సీడీసీ ఒక్కటే ఆశాదీపంగా ఉన్నది. అది కూడా ఇటీవల మార్క్‌ఫెడ్ నుంచి సివిల్ సప్లయ్‌కి టెస్కాబ్ ద్వారా ఇప్పించిన అప్పు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం మార్క్‌ఫెడ్‌పై పడినట్టు తెలిసింది. మరోవైపు ఎఫ్‌సీఐ ఎక్కువగా సీఎంఆర్ తీసుకోవడం లేదు. దీంతో అక్కడినుంచి కూడా నిధులు రావడం లేదు. ఇలా బ్యాంకులకు అసలు, వడ్డీల చెల్లింపుల కోసం తిప్పలు పడుతున్న సివిల్ సప్లయ్.. తక్షణ అవసరాల కోసం ధాన్యం బకాయిలు వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం. బకాయిలు చెల్లించడమో.. జైలుకు వెళ్లడమే ఏదో ఒకటి తేల్చుకోవాలని మిల్లర్లకు వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు సమాచారం.
టెండర్ ధాన్యం రికవరీని ఇంతకాలం నిర్ల క్ష్యం చేస్తూ వచ్చిన సివిల్ సప్లయ్ అధికారు లు.. తీరిగ్గా ముప్పై నెలల తర్వాత మొద్దునిద్ర వీడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆగమేఘాలపై మిల్లులపై దాడులకు తెగబడటం గమనార్హం. 2022-23 యాసంగికి సంబంధించి రూ.8,069 కోట్ల విలువజేసే 38.01 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించింది. ఇందులో 22.07 లక్షల టన్నుల ధాన్యం రికవరీ కాగా రూ.4,497 కోట్లు వచ్చాయి. ఇంకా 15.94 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. దీని విలువ ఏకంగా రూ.3,572 కోట్లు. గతంలో విక్రయించినప్పటికీ బిడ్డర్లు మొండికేసి ధాన్యం ఎత్తలేదనే ఆరోపణలున్నాయి. తొలుత మిల్లుల్లో ధాన్యం ఉన్నదని అంగీకరించి తర్వాత లేదంటూ టెండర్ నుంచి తప్పుకొన్నాయి.
ఈ క్రమంలో బిడ్డర్లకు ధాన్యం ఎత్తేందుకు మూడు నెలల సమయం ఇచ్చారు. కానీ గడువు మీద గడువు పెంచుతూ 16 నెలల పాటు గడువు పొడిగించారు. నిరుడు జూన్ 11తో వారికిచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. అయినా మొత్తం ధాన్యం ఎత్తలేకపోయారు. ఆ తర్వాత ఈ టెండర్లను రద్దు చేశారు. అంటే ఇప్పటికీ గడువు పూర్తయి ఏడాది దాటింది. అంతకుముందు 16 నెలల పాటు బిడ్డర్లకు వంతపాడుతూ గడువు పొడిగించిన సర్కార్.. ఆ తర్వాత ఏడాది కాలంగా మీనమేషాలు లెక్కించిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు అప్పుల భారం మీద పడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రికవరీపై దృష్టిపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మూడు నెలల్లో పూర్తిగా చెల్లించాలని మిల్లర్లకు అధికారులు మే నెలలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7తో గడువు ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు దాడులు చేస్తున్నారు. ‘మాకు దాడులు చేయాలనే ఆదేశాలున్నాయి. ఏదో ఒక అంశంపై దాడులు చేసి రిపోర్టు ఇవ్వాలి’ అని అధికారులు చెబుతున్నట్టు తెలిసింది. అంటే టెండర్ ధాన్యమా.. తాజా ధాన్యమా అనే విషయం కాకుండా దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మిల్లర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
సివిల్ సప్లయ్‌లో బకాయిలకు మిల్లర్ల త ప్పులు కొంత కారణమైతే.. అధికారుల నిర్ల క్ష్యం కూడా అదేస్థాయిలో ఉన్నదనే చర్చ జ రుగుతున్నది. సీఎంఆర్, బకాయిల వసూళ్లలో మిల్లర్లు చేసే తప్పులకు వంతపాడు తూ వారికి పరోక్షంగా సహకరిస్తూ పరిస్థితి ఇంతదాకా తెచ్చారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జిల్లాల్లో డీఎంలు, డీఎస్‌వోల అవినీతి, అరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువేననే అభిప్రాయాలున్నాయి. మిల్లర్లు ఇచ్చే లంచాలకు అలవాటు పడి వారికి ఊ డిగం చేశారనే అపవాదు లేకపోలేదు. ఓవై పు బకాయిలున్నా వాటిని వసూలు చేయకుండా మళ్లీ మళ్లీ ధాన్యం ఇచ్చారనే ఆరోపణలున్నాయి.
ఇలా ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు సివిల్ సప్లయ్‌కి కుచ్చుటోపీ పెట్టారు. ఒకవేళ అప్పుడే అధికారులు కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాల్లో పని చేసిన, చేస్తున్న డీఎంలు, డీఎస్వోలు అవినీతి సొమ్ముతో కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. బకాయిల సాకుతో మిల్లర్లపై దాడులు చేస్తూ జైలుకు పంపుతున్న విజిలెన్స్, సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు.. మరి అవినీతికి పాల్పడిన డీఎంలు, డీఎస్వోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.