ముంబై: టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఉదర సమస్యతో ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడడం లేదు. అయితే ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఏదో తినడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తున్నది. తీవ్రమైన స్థాయిలో కడుపు ఇన్ఫెక్షన్తో అతను బాధపడ్డాడు. దీని వల్ల అతన్ని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బుధవారమే అతన్ని డిశ్చార్జ్ చేశారు. కానీ నమీబియాతో మ్యాచ్‌కు అతన్ని దూరం పెట్టేశారు. ఇక ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడుతాడో లేదో తెలియదు.
కడుపు ఇబ్బందుల వల్ల అభిషేక్ శర్మ చాలా వరకు బరువు కోల్పోయినట్లు తెలుస్తోంది. డిహైడ్రేషన్ వల్ల అతి తక్కువ సమయంలోనే అతను ఎక్కువ స్థాయిలో వెయిట్ కోల్పోయినట్లు ఓ మీడియా తన రిపోర్టులో వెల్లడించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి ఆరో తేదీన ప్రాక్టీస్ సమయంలో అభిషేక్ ఏదో తిన్నాడని, దాంతో అతని కడుపులో సమస్యలు మొదలైనట్లు గుర్తించారు. అయితే మరుసటి రోజు అమెరికాతో మ్యాచ్ సమయానికి అతని ఆరోగ్యం క్షీణించింది. అయినా కానీ అతను మొండి పట్టుదలతో బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఒక్క బంతి మాత్రమే ఆడి అతను ఔటయ్యాడు. ఆ రోజు సాయంత్రానికి అతని శరీరం మరింత డీలాపడినట్లు రిపోర్టులో తెలిపారు.
వాతావరణంలో మార్పులు, ఉదర సమస్యల వల్ల అతనికి అధిక జ్వరం నమోదు అయ్యింది. తీవ్ర స్థాయిలో డీహైడ్రేషన్ కూడా జరిగినట్లు గుర్తించారు. ద్రవాలు ఎక్కువగా కోల్పోవడం వల్ల అభిషేక్ శర్మ బరువు కూడా భారీగా కోల్పోయినట్లు రిపోర్టులో చెప్పారు. దీంతో అతన్ని ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేర్పించారు.