రాయపోల్, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించు కోవాలని సీఐటీయూ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి అన్నారు. గురువారం మండల కేంద్రం రాయపోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో సఫాయి కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, హమాలి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టన నిరసన కార్యక్రమంలో కార్మికులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు పొట్టెల స్వామి మాట్లాడుతూ లేబర్ కోడు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు -2025ను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వీవోఏ, ఆర్పీలను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తక్షణమే వీబీజీ రాం జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఆదివారం, పండగలకు సెలవులు ప్రకటించాలని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్వామి పేర్కొన్నారు.