Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఇటీవల ‘కరుప్పు’ సినిమాతో మంచి విజయం దక్కిన విషయం తెలిసిందే. చాలా కాలంగా సూర్య ఎదురుచూస్తున్న సక్సెస్‌ను ‘కరుప్పు’ అందించడంతో ఆయన అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో సూర్య నుంచి వస్తున్న తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘కరుప్పు’ తర్వాత వెంటనే మరో సినిమా రావడం, అది కూడా పూర్తి భిన్నమైన క్లాస్, ఫ్యామిలీ డ్రామా కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్పందన వస్తుందనే ఆసక్తి నెలకొంది. ‘కరుప్పు’ తరహా మాస్ యాక్షన్ సినిమా కాకపోవడంతో బుకింగ్స్‌పై కొంత ప్రభావం ఉండొచ్చని పలువురు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. గత 24 గంటల్లో ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది సూర్య గత చిత్రం ‘కరుప్పు’ ప్రీ-సేల్స్‌కు దాదాపు సమానమైన స్థాయిలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం బుకింగ్స్ మాత్రమే కాకుండా.. సినిమా విడుదల రోజుకు సంబంధించిన టికెట్లతో కలిపి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తి క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథాంశంతో తెరకెక్కిన సినిమా. యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే విషయంలో మొదట కొంత సందేహం నెలకొంది.
అయితే సూర్యకు ఉన్న క్రేజ్, ‘కరుప్పు’తో వచ్చిన సక్సెస్ జోష్ ఈ సినిమాపై కూడా ప్రభావం చూపుతున్నట్లు బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. మాస్ సినిమాతోనే కాకుండా క్లాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమని సూర్య మరోసారి నిరూపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి సూర్యతో కలిసి ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉన్న కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్స్‌కు కూడా మంచి స్పందన రావడంతో బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి.
సూర్య గత చిత్రం ‘కరుప్పు’ విజయంతో ఆయన మార్కెట్లో వచ్చిన పాజిటివ్ బజ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు బాగా ఉపయోగపడినట్లు కనిపిస్తోంది. ప్రీ-సేల్స్‌లోనే 7 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగిందనే వార్త నిజమైతే.. సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌పై భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.