హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కార్మికశాఖలో వెలుగుచూసిన బీమా కుంభకోణంలో చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి. ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కార్మిక బీమా పథకం అర్హులకు అందకుండా పోతున్నది. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకొన్నట్టు సమాచారం. మంత్రి పేరు చెప్పి కొందరు దళారులు అడ్డంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేవలం తెల్లపేపర్లు పెట్టి రూ.లక్షల బీమా సొమ్మును క్లెయిమ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా మరణించిన భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించిన దరఖాస్తును సమర్పించే సమయంలో ఎప్పుడు, ఎలా చనిపోయాడు? ప్ర మాదం ఎలా జరిగింది? పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, శవ పంచనామా రిపోర్టు, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం ఫొటోలు, ఫ్యామిలీ సర్టిఫికెట్లతోపాటు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండాతెల్ల కాగితాలను మీ సేవ కేంద్రాల ద్వారా అప్లోడ్ చేసి బీమా మొత్తాలను క్లెయిమ్ చేసినట్టు సమాచారం.
ఒక్క మంచిర్యాల కార్మికశాఖ అధికారి కార్యాలయ పరిధిలోనే ఎలాంటి పత్రాలు లేని 50కి పైగా దరఖాస్తులకు బీమా క్లెయిమ్ మంజూరు చేసినట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లా పరిధిలో భారీగా భవన నిర్మాణ కార్మికుల బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకొన్నట్టు తెలిసింది. అంగవైకల్యం విషయంలో కూడా కనీస మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్ లేకుండానే క్లెయిమ్‌లు ఇచ్చినట్టు సమాచారం. ఈ జిల్లాలో కూడా వందకు పైగా ఇలాంటి బోగస్ క్లెయిమ్‌లు గడిచిన ఆరునెలల్లోనే మంజూరు చేసినట్టు తెలిసింది. దళారులు, స్థానిక అధికారులు కొందరు కలిసి బీమా సంస్థతో లాలూచీపడి బీమా సొమ్ము కాజేస్తున్నారు.
ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తుదారుడు బీమా క్లెయిమ్ చేసిన వారి వివరాలను అడుగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లా పరిధిలో 84 మంది బీమా క్లెయిమ్ చేసుకొంటే దీంట్లో 10 మంది క్లెయిమ్ వివరాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 74 మంది వివరాలు, వారు సమర్పించిన పత్రాలు లేవని అధికారులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించగా.. ఎక్కడా ఒక్క చిన్న కాగితపు ముక్క కూడా లేదని తేలింది. సమర్పించిన పత్రాలన్నీ కూడా తెల్లపేపర్లేనని తేలడంతో అక్కడున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
పెద్దపల్లి, సిరిసిల్ల, హుజూరాబాద్, మంచిర్యాలలో పెద్ద ఎత్తున బీమా సొమ్మును కొందరు దళారులు, అధికారులు కలిసి పంచుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ఏఎల్వో, ఏసీఎల్లుగా పనిచేసిన ఇద్దరు అధికారులు మొత్తం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. . వీరిద్దరు ఇంతటి ధైర్యం చేశారా? వీరి వెనుక ఎవరైనా ఉన్నతాధికారులు కూడా ఉన్నారా? అన్నది తేలాల్సి ఉన్నది.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి సంబంధించిన ప్రాంతాల్లో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే సదరు మంత్రి ఏం చేస్తున్నారన్న ప్రశ్న కలుగక మానదు. మంత్రి వివేక్ వెంకటస్వామిది చెన్నూరు (మంచిర్యాల జిల్లా) కాగా, ఆయన కుమారుడు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో, వారి శాఖలోనే ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే మంత్రి పట్టించుకోకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రి ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదా? లేక శాఖలో జరుగుతున్న వ్యవహారాలు మంత్రి దృష్టికి రావడం లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారులు మంత్రి కోరిక మేరకే ఇక్కడ పోస్టింగ్‌లు తెచ్చుకున్నారని సమాచారం.
‘కార్మిక శాఖలో బీమా స్కామ్’ పేరుతో శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనంపై కార్మిక శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు బీమా సొమ్ము చెల్లింపుల విషయంలో పత్రికలో వచ్చిన వార్తలపై విచారణ జరుపాల్సిందిగా ఆ శాఖ వరంగల్ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ నిర్వహించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలంగాణ బిల్డింగ్- అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సీఈవో పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. దోషులుగా తేలేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్లెయిమ్‌లపై విచారణ చేయాల్సిందిగా బీమా బ్రోకింగ్ కంపెనీని కూడా ఆదేశించినట్టు పేర్కొన్నారు. బీమా క్లెయిమ్‌లు ఇచ్చిన వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని, ఇవి నిజమైన పక్షంలో బ్రోకింగ్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కూడా వివరించాలని తాము ఆదేశించామని సీఈవో వెల్లడించారు. తమ బోర్డు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ప్రైవేట్ బీమా సంస్థ, బ్రోకింగ్ సంస్థలను ఎంపిక చేసిందని, వీటి ఎంపికలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సీఈవో నమస్తే తెలంగాణకు పంపిన వివరణలో పేర్కొన్నారు.