హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అంగీ మార్చినంత సులువుగా దానం నాగేందర్ పార్టీ కండువాలు మార్చుతారనేది ఇప్పటిదాకా అందరికీ తెలిసిన సత్యం. పార్టీనే కాదు… రాత్రికి రాత్రి మాటను సైతం అలవోకగా మారుస్తానని ఆయన తాజాగా నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ జెండా మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి కేవలం మూడు నెలల్లోనే కాంగ్రెస్‌లోకి దూకిన దానం నాగేందర్ ఎపిసోడ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు హైదరాబాద్ నగర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
హైకోర్టు తీర్పుపై శుక్రవారం స్పందించిన దానం ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానంటూ కాలు దువ్వారు. కానీ ఒక్కరోజు గడువగానే ఈ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దానం కచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా తాను ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ శనివారం మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది.
నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయడానికి దారితీసిన అంతర్గత రాజకీయ పరిణామాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు ఎదురైన అనుభవమే ఖైరతాబాద్‌లో తనకు పునరావృతం అవుతుందేమోనన్న అనుమానంతోనే దానం ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ‘ముఖ్య’నేతను నమ్ముకొకుని పార్టీలోకి వచ్చినప్పటికీ.. కిందిస్థాయి అధికారి కూడా తన మాట వినకపోవడం వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉన్నదనే భయాందోళనే ఆయన యూటర్న్ తీసుకొనేందుకు కారణమై ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
తన రాజకీయ జీవితంలో ఏకంగా నాలుగు పర్యాయాలు పార్టీలు మార్చిన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా రెండు రోజుల కిందట హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ అంశాన్ని కొంతకాలం సాగదీసి ఈసారికి ఎలాగోలా నెట్టుకురావాలని ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. ఉప ఎన్నికను తప్పించుకొనేందుకు చివరకు చేరిన పార్టీ ప్రభుత్వంమీదా ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ను పరోక్షంగా ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. హైకోర్టు తీర్పు అనంతరం.. ఫైటింగ్ తనకు కొత్త కాదంటూ భారీ డైలాగులు వల్లించిన నాగేందర్ ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాననే సవాల్ విసిరి చివరకు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారంటే తెర వెనక ఆసక్తికర కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు.
చాలాకాలంగా అంతర్మథనంలో దానం
బీఆర్ఎస్ తరపున గెలిచిన మూడు నెలలకే దానం కాంగ్రెస్‌లోకి దూకడం వెనుక అధికార దాహం ఉందనేది బహిరంగ రహస్యం. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేకపోవడంతో తాను పార్టీ మారితే ఆ కోటా నుంచి మంత్రివర్గంలోకి పోవచ్చనే ఆశతో దానం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది వాస్తవం. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ‘ముఖ్య’నేత మరొక వ్యూహంలో ఉన్నారనేది పార్లమెంటు ఎన్నికల నగారాతో తేటతెల్లమైంది.
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి ఆయనను అభ్యర్థిగా నిలపడంలో ‘ముఖ్య’నేతనే కీలక పాత్ర పోషించారనేది అప్పట్లో అందరికీ తెలిసిందే. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ తరపున ఓట్లు అడిగి.. ఆరు నెలల్లోపే మరోసారి కాంగ్రెస్ కోసం ఓట్లు అడగడంపై మొదట్లో దానం తటపటాంచినట్టు ఆయన అనుచరులు అప్పట్లోనే చెప్పారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత నెలలు గడిచినా మంత్రి పదవి దక్కకపోవడంతో మోసపోయానని ఆయన గ్రహించారు. మరోవైపు బీఆర్ఎస్ న్యాయపోరాటం కంటి మీద కునుకు లేకుండా చేసింది.
వ్రతం చెడినా ఫలితం దక్కనట్టు.. ఓవైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు సలుపుతుండగా.. ఇంకోవైపు ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడం, అధికార యంత్రాంగం తనను ఖాతరు చేయకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారైంది. హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముందునుంచే సిద్ధమైనట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో దీనివెనుక ‘ముఖ్య’నేత ప్రోద్బలం ఉన్నట్టు ప్రచారం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం సాయంత్రం దానంతో భేటీ కావడం.. ఆ తర్వాతనే తాను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని దానం ప్రకటించారు.

ఏదో తేడా కొడుతుందనే ఆందోళనలో నాగేందర్
ఉప ఎన్నికకు సిద్ధమని కాలుదువ్విన దానం నాగేందర్ తెల్లారేసరికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక ఆంతర్యమేందనే చర్చ జరుగుతున్నది. దానంను ఉప ఎన్నిక వైపు ఉసిగొలిపి తెరవెనుక ‘ముఖ్య’నేత చక్రం తిప్పుతున్నారనే అనుమానం నాగేందర్‌లో కలిగినందునే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కాంగ్రెస్‌వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఉప ఎన్నిక వచ్చే వరకు దానం వైపు మొగ్గుచూపి.. ఆపై హస్తినలో చక్రం తిప్పి ఖైరతాబాద్ నుంచి తన ముఖ్య అనుచరుడు రోహిన్‌రెడ్డిని బరిలోకి దింపాలనే వ్యూహంలో ‘ముఖ్య’నేత ఉన్నారనే అనుమానం దానం నాగేందర్ శిబిరంలో వ్యక్తమైనట్టు సమాచారం. ఇంతకుముందు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి, ఆపై ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగానే తనను కూడా ప్రజాక్షేత్రం నుంచి తప్పించే ప్రమాదమున్నదని నాగేందర్ భయపడుతున్నట్టు తెలిసింది.
హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం: జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : దానం నాగేందర్ పార్టీ పిరాయింపు విషయంలో హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దానం నాగేందర్ విషయంలో న్యాయం గెలిచిందని చెప్పారు. స్పీకర్ తీర్పు అన్యాయమన్న తమ వాదనను కోర్టు అంగీకరించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెంప పెట్టు అని..
మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఇదే తీర్పు రావడం ఖాయమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీళ్ల విషయంలో చేసిన ప్రకటన సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 80 టీఎంసీలకు పైగా శ్రీశైలం నీళ్లు వాడుకున్నామని చెప్పడం విడ్డూరమని ఎద్దేవాచేశారు. సాగర్ నుంచి 23 టీఎంసీల నీళ్లు తెచ్చి హుజూర్‌నగర్‌లో దాచావా? అని నిలదీశారు. ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణ ప్రజలకు శాశ్వత ద్రోహిగా మిగిలిపోతారని పేర్కొన్నారు.