హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలలో భోజనంలో కల్తీ జరిగి అస్వస్థతపాలవుతున్న విద్యార్థులపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సమీక్షించే తీరికలేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు ( Harish Rao ) ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కల్తీ ఆహారం మాకొద్దు అంటూ రోడ్డెక్కిన విషయం, హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో భోజనం బాగుండటం లేదని విద్యార్థుల నిరసనలపై ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం విచారకరమన్నారు.
ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ది ఏముంది? అని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటది అనడానికి ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ ఉదాహరణ అని ఎద్దేవ చేశారు.రాష్ట్ర అభివృద్ది కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సాధించిదేమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్ తోనే తేటతెల్లమైందని విమర్శించారు.
ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ రెడ్డి, మరో వైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీసిండని ఆరోపించారు.కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడట అన్నట్లు ఉన్న గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం?ఉస్మానియా విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలన?రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ప్రగల్భాలు పలకడం కాదు. ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం అంతకంటే కాదు.హార్వార్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా.. మీరు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయం.ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించి, గురుకుల విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని డిమాండ్ చేశారు.