Idli-Sambar | విద్యార్థులకు ఢిల్లీ(Delhi) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం పోషణ్(PM-POSHAN) మెనూలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇడ్లీ-సాంబార్ వడ్డించనున్నారు. ఆగస్టు 24 నాటికి ఇడ్లీ-సాంబార్‌ను తప్పనిసరిగా అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. పీఎం పోషణ్ సవరించిన మెనూ ప్రకారం రాగి హల్వా స్థానంలో గోధుమ పిండి, శనగ మసాలా, అలాగే వెజిటబుల్ దలియా (గోధుమ రవ్వ ఉప్మా) స్థానంలో జొన్నలు, సజ్జలను చేర్చారు. దీనితో పాటు రాబోయే రెండు వారాల్లో విద్యార్థులకు ఇడ్లీ-సాంబార్‌ను అందించనున్నారు.
ఆగస్టు 24 నాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ పాఠశాలలను, అమలు చేసే ఏజెన్సీలను ఆదేశించింది. సవరించిన మెనూలోని చాలా అంశాలు తక్షణమే అమల్లోకి వస్తున్నప్పటికీ, ఇడ్లీ-సాంబార్ అమలును వెంటనే చేపట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇడ్లీ తయారీకి ప్రత్యేక పరికరాలు, పదార్థాలు, రవానా సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది తదితర అవసరాల రీత్యా దీని అమలుకు రెండు వారాల గడువు ఇచ్చారు. అయితే వారంలో ఆరు రోజులు మోనూ ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.