– మన రైతులను ఎండబెట్టి.. పక్క జిల్లాకు సాగునీరు
– సాగునీరు అందించలేని మంత్రి ఉత్తమ్ రాజీనామా చేయాల్సిందే
– కరెంటు కోతలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం నేతృత్వంలో మునగాల విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి
– జాతీయ రహదారిపై ధర్నా, రాస్తా రోకో
– ప్రభుత్వం మేల్కొనాలని దున్నపోతుకు వినతిపత్రం
కోదాడ, సెప్టెంబర్ 22 : సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టి వేసిందని, సాగునీరు, సకాలంలో కరెంటు లేక పంటలు ఎండిపోతుంటే బాధ్యత వహించాల్సిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కావునా తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేసి రైతులకు క్షమాపణ చెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం వందలాది మంది రైతులతో కలిసి నాణ్యమైన కరెంటు ఇవ్వనందుకుగాను మునగాల మండల కేంద్రంలోని 33 కేవీ సబ్ స్టేషన్ ముట్టడించారు. అనంతరం 65వ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా ఉన్న ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగడుగునా క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఇందుకు వారు ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం’
బొగ్గు, నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులకు కరెంటు ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. సాగర్ డ్యామ్‌లో సరిపడా నీళ్లు ఉన్న పరిస్థితుల్లో కాలువల ద్వారా రైతుల చెరువులు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. అవినీతికి అలవాటు పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మాటలతో కాలాన్ని వెళ్లదీస్తూ, తన స్వార్థ రాజకీయాల కోసమే సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. గత జూన్ 25వ తేదీన సాగర్ నుంచి నీళ్లు వదిలినప్పుడు చెరువులు నింపాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, సాగర్ ఆయకట్టు రైతాంగానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల పక్షాన నిలబడి రాస్తారోకోలు చేసి, రాజీనామాలకు డిమాండ్ చేసిన తరుణంలో రెండో విడతలో నీరు వదిలారని తెలిపారు. అయితే, ఆ నీటిని కూడా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు ఇవ్వకుండా, కేవలం తన రాజకీయ అవసరాల కోసం పక్క జిల్లాలోని పాలేరుకు తరలించారని తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు లేని కాలువలపై, లిఫ్ట్‌ల పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్పడుతున్నారని, రైతుల పొలాలు ఎండిపోతుంటే ఆయనకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

‘రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం’
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన జాబ్ మేళా పేరుతో, హెలికాప్టర్లను షేర్ ఆటోల్లాగా వాడుకుంటూ సగం క్యాబినెట్‌ను తీసుకొచ్చి విహార యాత్రలు, ప్రదర్శనలు చేశారే తప్ప, కరెంటు, నీళ్లు లేక అల్లాడుతున్న రైతుల గోడు వినలేదని దుయ్యబట్టారు. పశువులు తాగడానికి, గ్రామాల్లో ప్రజలు తాగడానికి కూడా నీళ్లు లేక విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకోలేక, రైతులు అప్పుల పాలవుతూ, కిరాయికి జనరేటర్లు తెచ్చుకుని వేలాది రూపాయల డీజిల్ పోసుకుని పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. చెవులుండి వినలేని, కళ్లుండి చూడలేని ‘ఖబోది’ లా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. తానొక సైనికుడినని పదే పదే చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజంగా దేశంపై, కర్షకులపై చిత్తశుద్ధి ఉంటే తన చేతకానితనానికి బాధ్యత వహిస్తూ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన అధికారాన్ని విహార యాత్రల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంటు, సాగునీరు అందించాలని లేనట్లయితే మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ రాస్తారోకోతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

‘రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం’