– భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ
కరకగూడెం, సెప్టెంబర్ 22 : భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అధికారులను ఆదేశించారు. కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి, కల్వలనాగారం, మోతే రెవిన్యూ గ్రామాలలో కొనసాగుతున్న భూ రీసర్వేను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు చేపట్టిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నెంబర్లు, గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంభందిత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. అదేవిధంగా భూ రీసర్వేకు ఆయా గ్రామాలలోని రైతులు సహకరించాలని కోరారు. సబ్ కలెక్టర్ వెంట తాసీల్దార్ కాంతయ్య, రెవిన్యూ అధికారులు, రైతులు ఉన్నారు.