పెద్దపల్లి, ఫిబ్రవరి 12( నమస్తే తెలంగాణ): దేశవ్యాప్త సమ్మెలో(General strike )భాగంగా సింగరేణి(Singareni) రామగుండం ఏరియాలోని ఆర్జీ-3, అర్జీ-2, ఏపీఏ ప్రాంతాల్లో పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్య సమ్మెతో పనులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కార్మిక వర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
గోదావరిఖని 2వ బొగ్గు గని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల హక్కులను హరించి వేస్తుందని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని లేదంటే భవిష్యత్తులో కార్మికులకు మనుగడ ఉండదన్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బ్లాక్ లను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు.