న్యూఢిల్లీ: నీట్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. (Overhaul Of NTA) ఈ సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సూచనల మేరకు పలు మార్పులు చేపట్టనున్నారు. ఎన్టీఏ అవుట్సోర్సింగ్ పద్ధతులను సవరించడం కీలక మార్పులలో ఒకటని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే నీట్ లీక్ నేపథ్యంలో ఎన్టీఏ నుంచి కనీసం 47 మంది అధికారులను తొలగించడంతో పాటు కొందరిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి.
కాగా, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఫెలోషిప్‌ల కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వయంప్రతిపత్తి గల, స్వయం సమృద్ధి కలిగిన పరీక్షా సంస్థగా దీనిని తీర్చిదిద్దింది.
మరోవైపు జేఈఈ, నీట్, సీయూఈటీలతో సహా సుమారు 20 జాతీయ స్థాయి పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తుంది. అయితే పేపర్ లీక్స్ ఆరోపణలతో ఎన్డీఏ ప్రతిష్ట దిగజారింది. తాజాగా నీట్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలతో ఈ సంస్థను సమూల ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించింది.