నర్సాపూర్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగనున్నందున.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పట్టణ ప్రజలకు ఎస్సై పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కేంద్రం వద్ద పార్కింగ్ గురించి ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వారు తమ వాహనాలను వైపర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్‌కు 200 మీటర్ల పరిధిలోకి అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. వీరు తమ సెల్ ఫోన్లను ఇంటి వద్ద లేదా 200 మీటర్ల బయట ఉంచి లోపలికి రావాల్సి ఉంటుందని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct) అమల్లో ఉన్నదని, గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు, రోడ్డు షోలు, బాణాసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం, గుంపులు గుమికూడడం వంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్సై సూచించారు. మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, వాహన ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. చట్టం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, ప్రేరేపించే పోస్టులు, గెలుపు-ఓటమి పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి పాల్పడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. పోలీసు శాఖకు సహకరించి అందరూ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎస్సై రజింత్ కుమార్ రెడ్డి కోరారు.