చుంచుపల్లి, జూలై 25 : విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్‌తో కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలు పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి అన్నారు. చుంచుపల్లి మండలం ఎన్కే నగర్‌లోని కమ్మ సేవా కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్ యూనియన్లు, టీజీ, ఎస్టీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), మాస్‌లైన్, టీఆర్ఎస్ తదితర రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషకరమన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సిద్ధాంతాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటేనని, తెలంగాణలోని పేద, బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ, గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకెళ్లడమే అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. విభిన్న రంగాలకు చెందిన వారంతా ఒకే వేదికపైకి రావడం బతుకమ్మను వివిధ రకాల పూలతో అందంగా పేర్చినట్లుగా ఉందని ఆయన అభివర్ణించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోతే గూడేలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని రాకేష్‌రెడ్డి అన్నారు. ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదని, సామాజిక తెలంగాణ నిర్మాణానికి అడ్డంకిగా మారే తీవ్రమైన సమస్యగా గుర్తించి అందరూ కలిసి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏటా సుమారు రూ.2,100 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ మొత్తాన్ని కేటాయించడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదన్నారు. మరోవైపు మూసీ ప్రక్షాళనకు లక్షల కోట్లు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేయలేరా అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏటా సుమారు రూ.3.25 లక్షల కోట్లు ప్రవేశ పెడుతున్నప్పటికీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.25 వేల కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చెల్లించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చామని, ఇకపై కూడా సమష్టిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.