హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో జరుగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్రోల్మెంట్ అత్యంత కీలకమైన అంశమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లలో ఉన్న వ్యతిరేకత.. బీఆర్ఎస్కు అనుకూల ఓటుగా మారేలా ఇప్పటినుంచే పకా ప్రణాళికతో ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా శనివారం తెలంగాణ భవన్లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో వేర్వేరుగా సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా బాధ్యతలు అప్పగిస్తూనే, ఎన్రోల్మెంట్పై అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు.

Ktr
రేవంత్ సర్కార్‌పై యువత ఆగ్రహం
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, డిక్లరేషన్లు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే కోపంతో యువత ఉన్నారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ సర్కార్ తమను మోసం చేసిందని విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు భావిస్తున్నారని చెప్పారు. తమ సమస్యలతోపాటు అన్నదాతలు, మహిళలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ఎదుర్కొంటున్న సమస్యలను చదువుకున్నవారు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. అయితే ఆ వ్యతిరేకత బీఆర్ఎస్కు అనుకూలంగా మారేలా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని పార్టీ నేతలకు సూచించారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారి పార్టీ ఎవరిని నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి ఎవరైనా ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో మరోసారి విడివిడిగా కేటీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాలి
ఎన్నిక ఏదైనా గులాబీ జెండాకు పట్టంకట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నందున డిగ్రీ పూర్తిచేసిన వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హామీలు ఎగ్గొట్టి వంచిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని చెప్పారు. 2028లో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సర్వేలన్నీ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ ప్రజలు ఏమరపాటుగా ఉండవద్దని సూచించారు.

Ktr