సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లోని పలు రెస్టారెంట్లలో టీజీ సేఫ్ అధికారులు జరుపుతున్న దాడుల్లో పేరున్న హోటళ్ల డొల్లతనం కూడా బయటకు వస్తుండడంతో జనం షాక్‌కు గురవుతున్నారు. నగరంలోని విలాసవంతమైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ద(టీజీ సేఫ్) అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలోని డొల్లతనం భయటపడింది.
సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు మొత్తం20 ఆహార సంస్థలను తనిఖీ చేశాయి. తనిఖీల్లో పలు చోట్ల బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలలు తదితర లోపాలను అధికారులు గుర్తించారు. ఆహార భద్రత నియమాలు పాటించకపోవడంతో పాటు కల్తీ ఆహార పదార్థాలపై అనుమానం ఉన్న 21 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. ఆరు సంస్థలకు నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగుపర్చుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నట్లు టీజీ సేఫ్ అధికారులు తెలిపారు. వీటిని తిరిగి తనిఖీ చేసి, ఆహార భద్రత నిబంధనల అమలు స్థితిని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
సరైన ఆహార భద్రతా నియమాలు పాటించని గచ్చిబౌలిలోని ‘63 డిగ్రీస్ మోడర్న్ రీజినల్ బఫెట్’ (గచ్చిబౌలి), కొండాపూర్‌లోని మినర్వా గ్రాండ్, హైటెక్ సిటీలోని హోటల్ అవాసా లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కలుషిత, కల్తీ ఆహార పదార్థాల విక్రయం, పరిశుభ్రత పాటించని 11 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు తక్షణమే ఆహార పదార్థాల తయారీ, విక్రయాలు వంటి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు టీజీ సేఫ్ ఆయా సంస్థలకు తెలిపింది.
11 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్సులు సస్పెన్షన్:
సస్పెన్షన్ కు గురైన సంస్థల్లో హైటెక్ సిటీలోని మోనస్టరీ, కోల్ స్పార్క్ మల్టీ కుయిసిన్ రెస్టారెంట్, కంచి కేఫ్, గచ్చిబౌలిలోని శివాని ది రెస్టారెంట్ అండ్ బార్ ఎl సబా రెస్టారెంట్, ఉడిపిస్ ఉపహార్, అంతెర కిచెన్ అండ్ బార్, మాధాపూర్‌లోని లక్కీ మల్టీ కుయిసిన్ రెస్టారెంట్, సాయి రామ్ మెస్, ఇనార్బిట్‌మాల్‌లోని అం అహా తెలుగు కిచెన్ అండ్ బార్, ఫూసియన్9/అమ్నెసియా స్కై బార్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్లలో తక్షణమే ఆహార పదార్థాల విక్రయాలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.