చిలిపిచెడ్, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల నశించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చిలిపి చేడ్ మండల కేంద్రంలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ చేపట్టిన సమ్మెలో ప్రజానాట్య మండలి శేఖర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి.. కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ.. దేశ సార్వభౌమత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని, వీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని శేఖర్ డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు. అలానే.. గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్, వీవోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణ, హమలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరందరికీ కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, సెర్ఫ్ ద్వారా కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని కోరారు.
గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భావన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని శేఖర్ డిమాండ్ చేశారు, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికులకు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్క కార్మికులు పోరాటంలో పాల్గొనాలని పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.