Ramayan | బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం రామాయణపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్ కోసం భారతీయ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన అద్భుత స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, రామాయణ ట్రైలర్ కేవలం నాలుగు రోజుల్లోనే 800 మిలియన్ వ్యూస్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యూస్ కేవలం యూట్యూబ్‌లో వచ్చినవి మాత్రమే కాకుండా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నమోదైన మొత్తం వ్యూస్‌గా సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక భారతీయ చిత్ర ట్రైలర్‌కు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ‘రామాయణ’పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి సీతాదేవి పాత్రను పోషిస్తున్నారు. ఈ ఇద్దరి లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్లో చూపించిన విజువల్స్, పాత్రల డిజైన్, గ్రాండియర్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అంతేకాదు, ప్రతి పాత్రను అత్యంత సహజంగా, వైభవంగా ఆవిష్కరించేందుకు దర్శకుడు నితీష్ తివారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
‘రామాయణ’ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రాల్లో ఒకటిగా భావిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్, భారీ సెట్లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. ట్రైలర్లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ స్థాయి నాణ్యతను గుర్తు చేస్తోందని సినీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ట్రైలర్లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాలుగు రోజుల్లో 800 మిలియన్ వ్యూస్ సాధించడం ద్వారా ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది.