అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన
తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై కష్టపడి గెలిచిన భారత మహిళలు రెండో పోరులో తమ తడాఖా చూపెట్టారు. బౌలర్ల ప్రతిభకు తోడు ఓపెనర్లు షఫాలీ వర్మ (25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 55), స్మృతి మంధాన (25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్) ఖతర్నాక్ షాట్లతో చెలరేగడంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.
- రెండో టీ20లో భారత్ ఘన విజయం
- 2-0తో సిరీస్ సొంతం
రాయ్‌పూర్ : తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై కష్టపడి గెలిచిన భారత మహిళలు రెండో పోరులో తమ తడాఖా చూపెట్టారు. బౌలర్ల ప్రతిభకు తోడు ఓపెనర్లు షఫాలీ వర్మ (25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 55), స్మృతి మంధాన (25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్) ఖతర్నాక్ షాట్లతో చెలరేగడంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఏకపక్ష పోరులో ప్రత్యర్థి ఇచ్చిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.5 ఓవర్లలోనే ఛేదించింది.ఆతిథ్య బౌలర్లూ సత్తా చాటడంతో తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 102/8 స్కోరు మాత్రమే చేసింది. చిపో ముగెరి తిరిపానో (34), కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో (27 నాటౌట్) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్ నిక్కీ ప్రసాద్ (2/7) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో, చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.
ధనాధన్ ఫటాఫట్
చిన్న టార్గెట్‌ను భారత్ అలవోకగా ఛేజ్ చేసింది. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన ఓపెనర్లే దాదాపు లాంఛనం పూర్తి చేశారు. కెప్టెన్, వైస్ కెప్టెన్లు అయిన మంధాన, షఫాలీ బౌండరీల కోసం పోటీపడ్డారు. ఇందులో ఫఫాలీదే పైచేయి అయింది. భారీ షాట్లతో అలరించిన ఆమె తొలి ఓవర్లోనే 4, 6తో తన ఉద్దేశం ఏంటో చెప్పింది. న్యాషా వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో మంధాన కూడా టచ్‌లోకి రాగా.. మకుషా బౌలింగ్‌లో షఫాలీ మరోసారి 6,4తో ప్రేక్షకులను అలరించింది. న్యాషా వేసిన ఐదో ఓవర్లో మంధాన అందమైన షాట్లతో వరుసగా నాలుగు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించగా..షఫాలీ కూడా ఓ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఆపై మరింత జోరు పెంచిన షఫాలీ మవుంగ బౌలింగ్‌లో 4, 4, 6తో విరుచుకుపడి పవర్‌ప్లేను 76/0తో ముగించింది. టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక పవర్ ప్లే స్కోరు. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్టు ఏడో ఓవర్లో మంధాన క్రీజు దాటొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా 85 మీటర్ల భారీ సిక్స్‌తో తన బ్యాట్ పవర్ చూపెట్టింది. బిజా బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న షఫాలీ భారత్‌కు పది వికెట్ల విజయం అందించేలా కనిపించింది. కానీ, తర్వాతి బంతికే మరో షాట్ ఆడి మనుషాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో లాంగాఫ్ మీదుగా లాఫ్టెడ్ సిక్స్‌తో మంధాన మ్యాచ్‌కు అద్భుత ముగింపునిచ్చింది.
నిక్కీ డబుల్ ధమాకా
జింబాబ్వేను మరోసారి తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. పేసర్లు, స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. కొత్త బంతితో క్రాంతి గౌడ్, నందని శర్మ కట్టడి చేయడంతో జింబాబ్వే నాలుగో ఓవర్ వరకు బౌండరీల ఖాతా తెరవలేకపోయింది. తన తొలి రెండు ఓవర్లో క్రాంతి రెండే రన్స్ ఇవ్వగా.. 11 బంతులాడి ఒక్క పరుగు చేయని ఓపెనర్ కెలిస్ ఎన్ద్లోవు(0)ను నందని బౌల్డ్ చేసింది. పవర్ ప్లేలో 20/1తో నిలిచిన జింబాబ్వే స్పిన్ ఆడటంలోనూ ఇబ్బంది పడింది. ఏడో ఓవర్లో బిజా (7)ను దీప్తి శర్మ పెవిలియన్ చేర్చగా.. తొమ్మిదో ఓవరలో క్రాంతి బౌలింగ్‌లో షార్నె మేయర్స్ (9) కూడా డగౌట్ చేరుకుంది. ఈ దశలో కెప్టెన్ జోసెఫిన్, తిరిపానో నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. తిరిపానో కొన్ని బౌండరీలతో ఆకట్టుకుంది. కానీ, 15వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన ఆఫ్ స్పిన్నర్ నిక్కీ ప్రసాద్ అద్భుతమైన బౌలింగ్‌తో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్న నిక్కీ ఈసారి బౌలింగ్‌లోనూ మెరుస్తూ వరుస బంతుల్లో తిరిపనో, న్యాషాను పెవిలియన్ చేర్చింది. జోసెఫిన్ చివరి వరకూ క్రీజులో నిలిచినా.. స్లాగ్ ఓవర్లలోనూ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో జింబాబ్వే అతి కష్టమ్మీద వంద పరుగుల మార్కు దాటింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 102/8 (చిపో తిరిపానో 34, జోసెఫిన్ 27 నాటౌట్, నిక్కీ 2/7);
భారత్: 8.5 ఓవర్లలో 104/1 (షఫాలీ 55, మంధాన 47 నాటౌట్, బిజా 1/9)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

