– అధికార పార్టీ నాయకుల అండదండలతోనే దందా?
– గ్రామస్తుల ఆరోపణలు
టేకులపల్లి, ఆగస్టు 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అంజనాపాలెం సమీపంలోని గుట్టను జేసీబీలతో తవ్వి, రాత్రింబవళ్లు వందలాది ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. అంజనాపాలెం పరిసర ప్రాంతాల్లో గుట్టలను తవ్వి మట్టిని భారీ ఎత్తున విక్రయిస్తున్నారని, మండల వ్యాప్తంగా బొమ్మనపల్లి, దంతలతండా, సంపత్ నగర్, మద్రాస్ తండా పరిసర ప్రాంతాల్లో ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ప్రతిరోజూ భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ మట్టి దందా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల అండదండలతోనే నిర్భయంగా కొనసాగుతోందంటున్నారు. మండల స్థాయి అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో కూడా వందల ట్రక్కులు పోసినా పట్టింపు లేదని, అందువల్లే అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందంటున్నారు. వారం రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల మట్టిని తరలస్తున్నా పట్టింపు లేదని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే అరికట్టి, బాధ్యులెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టేకులపల్లి తాసీల్దార్ లంకపల్లి వీరభద్రం వివరణ కోరగా… మట్టి రవాణాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నాని తెలిపారు.

అంజనాపాలెం గుట్టను మింగేస్తున్న మట్టి మాఫియా