GST : జీఎస్టీ కౌన్సిల్లో కీలక మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న న్యూఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ అమలులో కీలక మార్పులు చేపట్టడంతోపాటు, కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జీఎస్టీ విషయంలో అవకతవకలకు పాల్పడిన వారిని అరెస్టు చేసే అధికారాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టిపెట్టింది.
పన్నులు వసూలు చేసే వ్యవస్థలు మరింతగా పౌరులకు అనుకూలంగా, అలాగే, పన్నును త్వరగా రికవరీ చేసేలా ఈ వ్యవస్థల్ని తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రానప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జీఎస్టీ అధికారులకు నిందితుల్ని అరెస్టు చేసేందుకు ఉన్న హక్కును తొలగించబోతున్నారు. ఇకపై జీఎస్టీ అధికారులు ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదు. అలాగే, ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా చట్టపరమైన అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే అమలులో ఉన్న సెక్షన్ 69 ప్రకారం నిందితుల్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేయరాదు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి పొందాలి. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించబోతున్నారు.
పన్ను ఎగవేతలో విచారణ జరిపేందుకు ఉన్న కనిష్ట పరిమితిని రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు పెంచబోతున్నారు. అంటే, తక్కువ పన్ను ఎగవేతదారులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోరు. అధికారులకు అరెస్టు చేసే హక్కును తొలగిస్తున్నప్పటికీ.. పన్ను వసూలు చేసే అధికారాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. పన్నులపై జరిమానా విధించే హక్కు కూడా అధికారులకు ఉంటుంది. డాటా ఆధారంగానే చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు ఉండనున్నాయి.