గువాహటి: నదిని దాటుతుండగా పడవ బోల్తాపడింది. పదేళ్ల బాలుడితో సహా ముగ్గురు నదిలో మునిగి మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (boat capsizes) అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ముగ్గురు వ్యక్తులు పడవలో ప్రయాణించారు. మార్కెట్లో అమ్మేందుకు మేకలతో సహా ఆ పడవలో మెర్బిల్ నదిని దాటేందుకు బయలుదేరారు. అయితే నీటి ప్రవాహం బలంగా ఉండటంతో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో పదేళ్ల బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు.
కాగా, పడవ బోల్తా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందం కలిసి ఆ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గంటసేపు వెతికిన తర్వాత ఆ ముగ్గురిని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
డియోలియా గావ్‌కు చెందిన 25 ఏళ్ల అజిత్ దత్తా, 50 ఏళ్ల పోద్మా దత్తా, పదేళ్ల మిధుస్మి దత్తాగా మృతులను పోలీసులు గుర్తించారు. వీరంతా బంధువులని తెలిపారు. ఆ ముగ్గురికి ఈత రాదని తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.