Puvvada Ajay Kumar : భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పవర్ స్టేషన్లోని కీలకమైన మూడో యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోవడం సర్కార్ నిర్లక్ష్య ధోరణిని స్పష్టం చేస్తుందని పువ్వాడ ధ్వజమెత్తారు.
థర్మల్ పవర్ స్టేషన్లోనిమూడో యూనిట్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిన కారణంగా రోజుకు విద్యుత్ తయారీలో 270 మెగా వాట్ల లోటు ఉందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. దీని ఫలితంగా ఇప్పటివరకూ 15.5 కోట్ల యూనిట్ల కొరత ఏర్పడిందని ఆయన వెల్లడించారు. కాబట్టి.. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించిన మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరించాలని పువ్వాడ డిమాండ్ చేశారు.