S Jaishankar : భారత భద్రతకు, సమగ్రతకు ముప్పు వచ్చిన సందర్భాల్లో ఇండియాకు రష్యా అండగా నిలిచిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ముఖ్యంగా 1950 తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రపంచం పాకిస్తాన్కు అండగా ఉంటే.. రష్యా ఇండియాకు మద్దతుగా నిలిచిందన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జైశంకర్ మాట్లాడారు. ఇటీవలి కాలంలో రష్యా-భారత్ బంధం మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ మద్దతుగా ఉంది.
దీంతో అమెరికా, యూరప్ వంటి పశ్చిమ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్నాయి. రష్యాకు ఇండియా అండగా నిలవడంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా-ఇండియా మధ్య ఉన్న బంధం గురించి జైశంకర్ వివరించారు. రష్యా గతంలో అనేకసార్లు ఇండియాకు అండగా నిలిచిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా అప్పటి సోవియట్ యూనియన్ 1950 నుంచి ఇండియావైపు నిలిచిందన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చర్యలకు వ్యతిరేకంగా ఇండియాకు రష్యా అండగా ఉందని తెలిపారు. 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకను పంపిందనే విషయాన్ని గుర్తు చేశారు.
ఆ సమయంలో రష్యా ఇండియాకు సపోర్ట్ చేసిందని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ఇండియా వైఖరిని కూడా జైశంకర్ సమర్ధించుకున్నారు. ఇండియా తన అవసరాలకు అనుగుణంగా, దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొంటుందని చెప్పారు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా సమర్ధించిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా జైశంకర్ స్పందించారు. చర్చలు, ద్వైపాక్షిక మార్గం, దౌత్య మార్గం ద్వారా శాంతియుతంగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు.