హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 4: ప్రజాస్వామ్యం వ్యవస్థంలో కీలకమైన న్యాయ వ్యవస్థలోకి వెళ్లాల్సిన లా విద్యార్థుల్లో (Law Students) కొందరు గతి తప్పుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు యథేచ్ఛగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇన్విజిలేటర్లు సైతం డబ్బులు తీసుకుని వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్ కాపీయింగ్‌పై బుకాయిస్తూనే.. ఇప్పటివరకూ 30మందిని డిబార్ చేశామని కేయూ కంట్రోలర్ కట్ల రాజేందర్ పేర్కొనడం గమనార్హం.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. శనివారం కేయూ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో కాపీ కొడుతూ ఎస్డీఎల్సీఈ విద్యార్థి పట్టుబడింది. అంతేకాదు తను ఏకంగా జవాబు పత్రంతో పరారైన సంఘటనతో ఒక్కొక్కటిగా మాస్‌కాపీయింగ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. భీమరంలోని అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సెంటర్లో ఎల్ఎల్బీ రెండు, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో లా విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీ, ఆదర్శ లా కళాశాల, ఎంజేపీ లా విద్యార్థులు అరుణోదయ కాలేజీలోలో ఓపెన్‌గా మాస్ కాపీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లా పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులకు ఇన్విజిలేటర్లు పూర్తి సహకారం ఇస్తున్నారని టాక్. స్వయంగా ఇన్విజిలేటర్లు ఫోన్లు, చిట్టీలు, పుస్తకాలు అందించి స్టూడెండ్స్ చూచిరాతకు సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయినా సరే పరీక్షల నియంత్రణాధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ‘రాసుకోనివ్వండి’ అంటూ లైట్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. పరిస్థితి చూస్తుంటే ‘ఊరికే మేం కొట్టినట్టు చేస్తాం. మీరు భయపడినట్టు నటించాలి’ అన్నట్లుగా యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారుల తీరు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నప్పటికీ మాస్ కాపీయింగ్ మాత్రం జోరుగా నడుస్తున్నట్లు వినికిడి.పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసే క్రమంలో అలర్ట్‌గా ఉండి తర్వాత యథావిధిగా మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
కొందరు మాస్ కాపీయింగ్‌కు పాల్పడడంతో బాగా చదివిన విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షల కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులు తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఈ చూచిరాతల బ్యాచ్ కారణంగా.. పగలు, రాత్రి అని తేడా లేకుండా బాగా మార్కులు రావాలని కష్టపడి చదివిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడందేలు. కష్టపడి చదివినవారి కంటే ఏమీ రానివారికి అధికంగా మార్కులు రావడమే మాస్ కాపీయింగ్‌కు నిదర్శనమని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల వాదనకు భిన్నంగా యూనివర్సిటీలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగడంలేదని కంట్రోలర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ‘ప్రతిరోజూ అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగడం లేదు. ఎవరైనా మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే వెంటనే డిబార్ చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 30 మంది విద్యార్థులను తదుపరి పరీక్షలు రాయకుండా చేశాం. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రంలోని పంపిస్తున్నాం’ అని పేర్కొన్నారు.