ఎట్టకేలకు తెలంగాణకు ఊరట
రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదేం డ్ల కిందటే తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన అదనపు శాసనసభ, పార్లమెంట్ స్థానాలు ఎట్టకేలకు అమలు కాబోతున్నాయి.
- పన్నెండేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
- విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
- 179 అసెంబ్లీ సీట్లు , లోక్‌సభ స్థానాలు 26
- 33% కోటాతో పెరుగనున్న మహిళా ప్రాతినిథ్యం
- రాజకీయ, పరిపాలన సుస్థిరతకు దోహదం
- యువతకు అందుబాటులో విస్తృత అవకాశాలు
- పాత ఆధిపత్యాలకు చెక్.. కొత్త తరానికి చాన్స్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదేం డ్ల కిందటే తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన అదనపు శాసనసభ, పార్లమెంట్ స్థానాలు ఎట్టకేలకు అమలు కాబోతున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు శుక్రవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలను సమాన నిష్పత్తిలో 50 శాతం చొప్పున పెరుగనున్నాయి.
పెంచిన సీట్లను 2051 సంవత్సరం వరకు యథాతథంగా కొనసాగించేలా ఫ్రీజ్ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలను పార్లమెంట్ ముం దు ఉంచనున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ల అమలును కూడా ఈ ప్రక్రియతో అనుసంధానం చేయనున్నారు. కేంద్రం ప్రతిపాదనలు చట్టరూపం దాల్చి, అమలైతే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్రంలో కొత్తగా సుమారు 60 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్‌సభ స్థానాలు ఏర్పడుతాయి. దీంతో విభజన హామీకి మించి, 50% పెంపుతో రాష్ర్టానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో నవశకం మొదలవుతుంది.
‘విభజన’కు మించి లాభం
ప్రస్తుతం రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాస్తవానికి 2014లో పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 (1) ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు జరుగాల్సి ఉన్నది. తెలంగాణ శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విభజన చట్టంలో స్పష్టంగా పేరొన్నారు. అది అమలైతే అదనంగా 34 అసెంబ్లీ సీట్లు (28.5 శాతం) పెరిగేవి. లోక్‌సభ సీట్ల పెంపుపై విభజన చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేసినా 17 స్థానాలకు అదనంగా 3-4 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండేది.
ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన డీలిమిటేషన్ బిల్లు ప్రకా రం అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లను పెచనుండటంతో తెలంగాణకు విభజన చట్టం కంటే భారీగా లబ్ధి చేకూరుతున్నది. 50% పెంపు అమలైతే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు అదనంగా 60 వరకు పెరుగుతాయి. అంటే సీట్ల సంఖ్య 119 నుంచి 179 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో 17 లోక్‌సభ స్థానాలకు 50% పెంపు వర్తిస్తే అదనంగా 8 లేదా 9 సీట్లు పెరుగుతాయి. మొత్తం 25 లేదా 26కు చేరుకుంటుందని రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తాజా అంచనాల పట్టికలో కూడా తెలంగాణకు 26 స్థానాలు చూపించారు. అంటే అదనంగా తొమ్మిది స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది.
బలమైన రాజకీయ స్థిరత్వం
నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగితే రాజకీయ స్థిరత్వం మరింత బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం 119 స్థానాలు మాత్రమే ఉండటంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీ 60 సీట్లుగా ఉన్నది. మెజారిటీకి కొద్దిదూరంలో పార్టీలు నిలిచినా, స్వల్ప మెజారిటీతో గట్టెక్కినా పార్టీ ఫిరాయింపులు తలనొప్పిగా మారాయి. దీంతో ప్రభుత్వాల స్థిరత్వంపై అపనమ్మకం ఏర్పడింది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే అధికార, ప్రతిపక్షాల మధ్య సీట్ల అంతరం స్పష్టంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ మెజారిటీ రాకపోయినా, స్వల్ప మెజారిటీతో గట్టెక్కినా ఫిరాయింపులు, విలీనం కష్టమవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో బుజ్జగింపులు, బేరసారాలకు చెక్ పడి, ఐదేండ్లపాటు రాజకీయ స్థిరత్వం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు.
మారనున్న రాజకీయ ముఖచిత్రం
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనున్నది. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే రాజకీయ పార్టీల వ్యూహాలు మారుతాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి సామాజిక సమీకరణాల వరకు ప్రతి అంశాన్ని కొత్తగా అంచనా వేయాల్సి వస్తుంది. మహిళలు, యువత, వెనుకబడిన సామాజిక వర్గాలు, స్థానిక ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దశాబ్దాలుగా ఒకే రాజకీయ నాయకత్వం చుట్టూ తిరిగిన ప్రాంతాల్లో కొత్త వాతావరణం నెలకొనవచ్చు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ పలుకుబడితోనే నెట్టుకొస్తున్న వారికి కొత్త సవాళ్లు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇన్నాళ్లూ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల బలం ఎక్కువగా ఉన్న పార్టీల హవా నడిచిందని, ఇకపై ఆధిపత్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అనివార్యంగా కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందని, యువత, మహిళలు, స్థానికంగా ప్రజాదరణ కలిగిన నాయకులను ప్రోత్సహించాల్సి వస్తుందని స్పష్టంచేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఒక నియోజకవర్గంలో మైనారిటీగా ఉన్న వర్గం కొత్త నియోజకవర్గంలో గణనీయమైన ఓటు శక్తిగా మారవచ్చని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మద్దతు కోరిన కేంద్రం
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దక్షిణాది రాష్ర్టాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలుగకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచుతూ 2051 వరకు యథాతథ స్థితిని కొనసాగించేలా కేంద్ర మంత్రివర్గం డీలిమిటేషన్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనికి చట్టరూపం కల్పించేలా ఆమోదం దొరికేందుకు ఎన్డీయే ప్రభుత్వం కీలక ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది.
అందుకే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మద్దతును కేంద్రం కోరినట్టు తెలిసింది. దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన దక్షిణాది రాష్ర్టాల్లో వాటాకు భంగం కలుగవద్దని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన షరతులు విధించారు. తాజాగా కేంద్రం ఆ ప్రధాన డిమాండ్‌కు తలొగ్గి జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం పెంపును ప్రతిపాదించింది. దీనికి తోడు మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మొదటి నుంచీ కట్టుబడి ఉండటంతో రెండు బిల్లులకు మద్దతుగా పార్టీ నేతలు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

