ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక, పంటలు పండక తల్లడిల్లిన తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన స్వల్పకాలంలోనే సత్తా చాటింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అనూహ్యమైన వృద్ధి సాధించింది. ఏటేటా తన రికార్డులను తానే తిరగరాస్తున్నది. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి అందించిన ప్రోత్సాహం, ప్రాజెక్టుల నిర్మాణం, జలవనరుల నిర్వహణపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధే కారణం.
హైదరాబాద్, మార్చి 1, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న, విప్లవాత్మక పథకాలతో పాటు కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ఏడున్నరేండ్లలో రికార్డు స్థాయిలో 142 శాతం పెరగడం విశేషం. ఇందులో 95 శాతం వృద్ధిని పంటలు, పశుసంపద నమోదు చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో పటల దిగుబడి విలువ రూ.41,706 కోట్లు ఉండగా, 2020-21లో రూ.80,574 కోట్లకు పెరిగింది. స్వరాష్ట్రంలో పంటల దిగుబడి విలువ దాదాపు రెట్టింపయ్యింది. పంటల దిగుబడిలో వరి 5 రెట్లు, పత్తి 3 రెట్లు పెరిగింది. వరి సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో, పత్తి సాగులో రెండో స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో రాష్ట్ర వ్యవసాయరంగం వృద్ధి రేటు 16.3 శాతం నుంచి 20.5 శాతానికి పెరగడం విశేషం. ఈ స్థాయి పెరుగదలను దక్షిణాది రాష్ర్టాల్లో మరేది సాధించలేకపోయింది. తెలంగాణ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (14.6%), కర్ణాటక (10%), తమిళనాడు (9.4%), కేరళ (2.8%) నిలిచాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంవర్థకం, అటవీ, పర్యావరణ, మత్స్య, ఆక్వాకల్చర్ తదితర రంగాల ద్వారా రాష్ట్రంలోని 55 శాతం ప్రజలకు ఉపాధి లభిస్తున్నది.
మూడు రెట్లు పెరిగిన పశు సంపద
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలిస్తున్నది. ఏడేండ్లలో రాష్ట్రంలోని పశుసంపద మూడు రెట్లు పెరిగింది. 2014-15లో పశుసంపద విలువ రూ.29,282 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.94,211 కోట్లకు చేరింది. రాష్ట్రంలో 2013-14లో 4.46 లక్షల మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2019-20 నాటికి 8.48 లక్షల టన్నులకు పెరిగింది. గొర్రెల పంపిణీ పథకం ఇందుకు దోహదం చేసింది. చేపలు, రొయ్యలు, గుడ్ల ఉత్పత్తి రెట్టింపయ్యింది. మత్స్య సంపద విలువ రూ.2,670 కోట్ల నుంచి రూ.5,254 కోట్లకు ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్లను నిర్మించడం, మిషన్ కాకతీయతో చెరువులను పటిష్ఠం చేయడం, ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడం వంటి చర్యలతో ఇది సాధ్యమైంది.
పంటల దిగుబడి విలువ
రూ.41,706 కోట్లు
రూ.80,574 కోట్లు
పశుసంపద విలువ
రూ.29,282 కోట్లు
రూ.94,211 కోట్లు
మత్స్యసంపద విలువ
రూ.2,670 కోట్లు
రూ.5,254 కోట్లు
వ్యవసాయరంగం వృద్ధి రేటు
16.3% 20.5%
2014-15 2020-21
దక్షిణాది రాష్ర్టాల్లో వ్యవసాయరంగంలో వృద్ధి రేటు