శనివారం 16 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 09:46:18

షాద్‌నగర్‌ మార్కెట్‌లో ఎనిమిది ట్రేడర్స్‌ దుకాణాల్లో రూ.3లక్షలు చోరీ

షాద్‌నగర్‌ మార్కెట్‌లో ఎనిమిది ట్రేడర్స్‌ దుకాణాల్లో రూ.3లక్షలు చోరీ

రంగారెడ్డి : షాద్‌నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్దనున్న ప్రభుత్వ మార్కెట్ యార్డులోని దుకాణాలను దొంగలు లూటీ చేశారు. దాదాపు ఎనిమిది ట్రేడర్స్ షాపులకు సంబంధించిన షెట్టర్లను ధ్వంసం చేసి అందులోకి చొరబడి.. సుమారు రూ.3లక్షల వరకు నగదును దోచుకువెళ్లినట్లు బాధిత ట్రేడర్స్‌ తెలిపారు. 2, 4, 5, 6, 16, 17, 21 నంబరు దుకాణాల్లో దొంగతనాలు జరిగాయని బాధితులు పేర్కొన్నారు. శివ శంకర్ ట్రేడింగ్ కంపెనీలో రూ.1.70లక్షలు, రమణ దుకాణంలో రూ.20వేలు, మల్లప్ప షాప్‌లో రూ.30వేలు, ఓంసాయి ట్రేడర్స్‌లో రూ.50వేలు, వేంకటేశ్వర ట్రేడర్స్‌లో రూ.3వేలు, అమరవది కృష్ణయ్య షాపులో రూ.3వేలు మల్లేశ్వరస్వామి షాపులో నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

అర్ధరాత్రి జరిగిన దొంగతనాలపై ట్రేడర్స్‌ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌కు చెందిన హమాలీలు పక్కనే ఉన్న షెట్టర్లలో పడుకున్నారు. అయితే తెల్లవారు జామున 4 గంటలకు లేచి చూడగా.. షెట్టర్లు పెకిలించి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే యజమానులకు ఫోన్‌ చేయగా.. హుటాహుటిన యార్డు వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.