శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 26, 2020 , 00:06:26

అహ్మద్‌ పటేల్‌ ఇకలేరు

అహ్మద్‌ పటేల్‌ ఇకలేరు

  • కరోనా, మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో మరణించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
  • రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కేసీఆర్‌ సంతాపం
  • కాంగ్రెస్‌ ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ (71) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో కరోనాకు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో (మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో) ఆయన మరణించినట్టు అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ తెలిపారు. అహ్మద్‌ పటేల్‌ను పార్టీలకు అతీతంగా ‘అహ్మద్‌ భాయ్‌'అంటూ అందరూ ఆప్యాయంగా పిలుస్తారు. 

సోనియా, రాహుల్‌ సంతాపం

అహ్మద్‌ పటేల్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సీఎం కే చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మరోనేత రాహుల్‌ గాంధీతోపాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వాన్ని గట్టెక్కించారు

అహ్మద్‌ పటేల్‌ 1949, ఆగస్టు 21న గుజరాత్‌లోని భరూచ్‌లో జన్మించారు. విద్యార్థి దశలోనే యూత్‌ కాంగ్రెస్‌లో చేరారు. 1976లో తొలిసారి భరూచ్‌ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ భరూచ్‌ లోక్‌సభ నుంచి ఆయన్ని బరిలోకి దింపారు. అక్కణ్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మూడుసార్లు లోక్‌సభకు, ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008లో వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకోవడంతో అప్పటి యూపీఏ సర్కార్‌ పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో అహ్మద్‌ పటేల్‌ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అహ్మద్‌ పటేల్‌.. మెమూనాను 1976లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. మీరు ఆత్మకథ రాయవ చ్చుకదా అని ప్రముఖ  రచయిత రషీద్‌ కిద్వాయి ఇటీవల అహ్మద్‌ను అడిగినప్పుడు, తనకు తెలిసిన రహస్యాలు తనతోపాటే సమాధి అవుతాయని, వాటిని వెల్లడించబోనని  అహ్మద్‌పటేల్‌ చెప్పారట.


logo