శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 11, 2020 , 01:18:53

పరిశోధనా కేంద్రానికి కొత్త భవంతి

పరిశోధనా కేంద్రానికి కొత్త భవంతి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ శివారులోని చింతకుంటలో కొనసాగుతున్న వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి అన్ని హంగులతో కొత్త భవన నిర్మాణం పూర్తయింది. శనివారం స్థానిక మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి దీనిని ప్రారంభిస్తున్నారు. జిల్లాలో ముఖ్యమైన పంటలైన మక్క, పప్పు ధాన్యాలు, చమురు విత్తనాల వంటి వాటిపై ప్రయోగాలు నిర్వహించేందుకు 1955లో కరీంనగర్‌ శివారులోని చింతకుంటలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 48.5 ఎకరాల్లో ఉన్న పరిశోధన స్థానం ముందు నుంచీ మక్క విత్తనోత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పర్యావసనంగా 1993 నుంచి ఆల్‌ ఇండియా కో ఆర్డినేటెడ్‌ మేజ్‌ ఇంప్రూమెంట్‌ ప్రాజెక్టుగా అమలోకి వచ్చింది. అనంతరం వ్యవసాయ పరంగా జిల్లా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి జిల్లా వ్యవసాయ సలహా, సాంకేతిక కేంద్రాన్ని ఇక్కడికి మార్చారు. ఈ నేపథ్యంలో పరిశోధనా స్థానంలో ఉన్న పాత భవనం పక్కన రూ.1.98 కోట్లతో అన్ని హంగులతో నూతన భవనాన్ని నిర్మించారు. 

 నేడు ప్రారంభం..

నూతన భవనం నేడు ప్రారం భం కాబోతున్నది. ఉదయం 11 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, బీసీ, సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి.

ప్రయోజనాలు..

పరిశోధనా కేంద్రంలో వర్షాధార, నీటి పారుదల కింద సాగు చేసేందుకు అనువైన మక్క సంకర జాతి విత్తనాలను అభివృద్ధి చేస్తుంది. కరువును తట్టుకుని నిలబడే సంకర జాతి మక్క విత్తనాలను వృద్ధి చేయడం, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు శిక్షణ ఇస్తుంది. క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించడం, క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, పరిశోధన సంస్థల ఇతర జిల్లా విభాగాలతో సంబంధాలు ఏర్పర్చుకుని కిసాన్‌ మేళాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సైంటిస్ట్‌ మంజులత తెలిపారు.  


logo