శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 23, 2020 , 02:50:38

కరీంనగర్ కారుదే విజయం

కరీంనగర్ కారుదే విజయం
 • - బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
 • - వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి కేరాఫ్ నిలుపుతా
 • - మంత్రిగా హామీ ఇస్తున్నా.. రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దుతా
 • - అభివృద్ధికే కాదు.. మా వాళ్లు తప్పు చేస్తే శిక్షించే బాధ్యత నాదే..
 • - బాధ్యత తీసుకునే దమ్ము, ధైర్యం ప్రతిపక్షాలకు లేదు
 • - ప్రతిపక్షాలు ఒక్క సీటు గెలిచినా అభివృద్ధికి అడ్డుపడుతరు
 • - సర్కారు, మున్సిపల్ పాలకవర్గం రెండూ ఒక్క పార్టీ అయితేనే ప్రగతి సాధ్యం
 • - ప్రచారానికి అనూహ్య స్పందన.. 50 డివిజన్లలో విజయం మాదే..
 • - ఎంపీగా గెలిచి తొమ్మిది నెలలైనా బండి సంజయ్ ఒక్క పైసా తేలేదు
 • - ఏదో రకంగా సానుభూతి పొంది ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నం
 • - ‘నమస్తే తెలంగా

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘కారు’దే విజయమనీ, బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి కేరాఫ్ నిలుపుతానన్న ఆయన, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాతి నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము చేసిన అభివృద్ధి, చేయబోయే పనుల గురించి వివరించారు.   

‘విప్లవాల ఖిల్లా మనది. ఉద్యమాల గడ్డ మనది. ఈ గడ్డ బిడ్డలు చాలా విజ్ఞులు. అన్నీ ఆలోచించి ఓటు వేస్తారు. అద్భుతమైన తీర్పును ఇస్తూ.. అభివృద్ధి చేసే వారికి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం.. ప్రతీ ఎన్నికల్లో గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవడం. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరిస్తారన్న పూర్తి విశ్వాసం నాకున్నది. మా ప్రచారాలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను చూస్తే.. మొత్తం 50 సీట్లకుపైగా కారుదే విజయమన్న సంకేతాలు వస్తున్నాయి.’ అని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నేను ముందు నుంచీ చెబుతున్నాను. మళ్లీ మీ పేపర్ సాక్షిగా చెబుతున్నా. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికే కాదు, మా వాళ్లు ఎవరు తప్పు చేసినా శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా.

ఇది ఎన్నికల కోసం చెబుతున్న మాట కాదు, ఈ గడ్డ ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ఇస్తున్న హామీ’ అని స్పష్టం చేశారు. ఈ తరహా బాధ్యత తీసుకునే సత్తా ప్రతిపక్షాల్లో ఏ నాయకుడికీ లేదనీ, ఎందుకంటే వాళ్లు అవసరానికి మాత్రమే ఓట్లు అడుగుతారనీ, ఆ తదుపరి కనిపించకుండా పోతారని విమర్శించారు. అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే బీజేపీ, కాంగ్రెస్ గాకుండా.. కంటి ముందు కనిపించే కారు గుర్తు అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గెలిచి తొమ్మిది నెలలవుతున్నా.. నగరాభివృద్ధికి ఒక్క పైసా తేకపోగా ఈ ఎన్నికల్లో ఏదో ఒక సంఘటన సృష్టించి సానుభూతి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆవేదన చెందారు. ప్రజలు అన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ‘నవ’ నగర నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు.
   

కారు గుర్తుకే ఎందుకు ఓటేయాలి?

మంత్రి: సమైక్య పాలనలో ఈ పట్టణం దశాబ్దాలుగా వివక్షకు గురైంది. సరైన అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం నిధులివ్వాలని సమైక్య ప్రభుత్వంలో ఎన్నో విజ్ఞప్తులు చేశాం. అవి బుట్ట దాఖలు అయ్యాయే తప్ప ఒక్క పైసా రాలేదు. మరోవైపు కార్పొరేషన్ ఉండే ఖజానా కూడా అంతంత మాత్రమే. అందుకే.. మన ప్రధాన రహదారులే కాదు. అంతర్గత రోడ్లు కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వకపోతే.. మున్సిపల్ నిధులతో మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కష్టం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకున్నారు. ఏటా రూ.వంద కోట్ల నిధులు ఇవ్వడానికి ఒప్పుకోడమే కాదు.. నేరుగా బడ్జెట్ పెడుతున్నారు.

అలా ఇప్పటికే రూ. 350 కోట్లు ఈ నగరానికి వచ్చాయి. వాటితో అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సిన అవసరం ఉంది.. గతంలో నగరంలోని ప్రధాన రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అందరూ కళ్ల నిండా చూశారు. కానీ.. ప్రస్తుతం వాటికి మహర్దశ పట్టింది. ప్రధాన నగరాలకు ధీటుగా ప్రధాన రహదారులన్నీ పూర్తయ్యాయి. పూర్తిస్తాయి విస్తీర్ణంతో ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. డివైడర్, వాటి మధ్యలో చెట్లు, సెంట్రల్ లైటింగ్ రహదారులు రాత్రి వేళ్లలో తళుక్కుమనేలా చేశాం. ఇవన్నీ ప్రజల కళ్ల ముందున్నాయి. ఇదే తరహాలో అంతర్గత ప్రధాన రోడ్లు, కాలనీరోడ్లు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రూ.700 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇవే కాదు.. స్మార్ట్ సిటీని జట్టుకట్టి పట్టు పట్టి తెచ్చింది మేమే. ఈ ఘనత మా ముఖ్యమంత్రికి, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ మాకు దక్కుతుంది. స్మార్ట్ బీజేపీ మనకు ఇవ్వలేదు.

కానీ.. వెంటపడి హైదరాబాద్ ఆ జాబితాలో నుంచి రద్దు చేసి దాని స్థానంలో కరీంనగర్ పెట్టి తెచ్చాం. ఇవే కాదు.. కరీంనగర్ ఐటీటవర్ రెండేళ్లలోనే పూర్తి చేశాం. మానేరుపై ఒకే వంతెన ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. ఇది రహదారికే కాదు.. పర్యాటక కేంద్రానికి దోహద పడుతుంది. మానేరు రివర్ ఫ్రంట్ సాధించాం. ఇలా ఏ కోణంలో చూసినా.. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేశాం. ఇన్ని పనులు చేశాం. ఇంకా చేస్తాం కాబట్టే కారు గుర్తుకు ఓటు వేయాలంటున్నాం. ఈ హక్కు మాకు మాత్రమే ఉంది. ఇంకా ఎవరికి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే.. ఈ నగరానికి వారు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక.
   

భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?

మంత్రి: ప్రధాన రహదారుల మాదిరిగానే ప్రతి కాలనీలోని రోడ్లను తయారు చేస్తాం. క్లీన్ అండ్ గ్రీన్ మారుస్తాం. అద్భుత మాస్టర్ ప్లాన్ తయారుచేసి, శివారు కాలనీలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తాం. దశాబ్దాలుగా కలలుగంటున్న ఇంటింటికీ మంచినీటిని మూడు నెలల్లో ఇచ్చి తీరుతాం. ఆరు నెలల తదుపరి 24 గంటల నీటి సరఫరా చేసి తీరుతాం. వీటికి సరిపడే స్థాయిలో ఇప్పటికే పైపులైన్లు వేశాం. ఇవేకాదు.. ప్రస్తుతం ప్రారంభించిన పనులను నిర్ధిష్ట కాలంలో పూర్తి చేస్తాం. వచ్చే జూన్ కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఇవి మచ్చుకు మాత్రమే.. ఇంకా చేయాల్సిన పనుల ప్రణాళిక మా వద్ద ఉంది. వచ్చే ఐదేళ్లలో ‘శభాష్’ అనే తీరులో పనిచేసి.. మన నగరాన్ని రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలుపుతాం. చెప్పిన ప్రతీ పనిని తూచ తప్పకుండా చేసి చూపిస్తాం. ప్రస్తుతం ఐటీ టవర్ పూర్తిచేశాం. అందులో మూడువేల మందికి ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్ ఐటీహబ్ ఏర్పాటుచేస్తాం.
   

ఈ పనులన్నీ జరగాలంటే మీరు ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు?

మంత్రి: నాది ఒక్కటే విజ్ఞప్తి. మనం అనుకున్న నవనగరం కావాలంటే.. ఈ ఎన్నికల్లో మన కార్పొరేషన్ గులాబీ జెండా ఎగరాలి. ఇది నేను స్వార్థంతోనో, స్వప్రయోజనం కోసమో చెప్పడం లేదు. ఎందుకంటే.. స్థానిక సంస్థల పరిధిలో ఆశించిన స్థాయిలో నిధులుండవు. చిన్న చిన్న రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేయాలంటేనే ముప్పుతిప్పలు పడాల్సి ఉంటుంది. మనం సమగ్రాభివృద్ధి సాధించాలంటే.. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం. కాబట్టి.. ప్రస్తుతం రాష్ట్రంలో కారు సర్కారే అధికారంలో ఉంది. అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ అంటే ఎనలేని ప్రేమ. ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీలో గులాబీ పాలకవర్గం ఉంటే.. పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చు. మనం ఆశించిన అభివృద్ధిని చేసుకోవచ్చు. అందుకే.. సమగ్రాభివృద్ధి కోసం.. కారు గుర్తుకు ఓటువేసి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
   

అభివృద్ధికే కాదు.. టీఆర్ కార్పొరేటర్లు ఎవరూ తప్పు చేసినా.. శిక్షించే బాధ్యత కూడా మీరే తీసుకుంటామని ప్రతీ సమావేశంలో         చెబుతున్నారు. ఆ మాటకు కట్టుబడి ఉంటారా?

మంత్రి: రాజకీయ రంగంలో ఇరవై ఏళ్లుగా ఈ గడ్డ బిడ్డలు అక్కున చేర్చుకుంటున్నారు. అపజయం అంటే ఏమిటో తెలియకుండా విజయాన్ని ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు.. నాకు ప్రస్తుతం మంత్రిగా అవకాశం వచ్చిందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు ఈ ప్రాంత బిడ్డలు నాకు ప్రసాదించిన ఒక వరంగా భావిస్తున్నా. ఈ పరిస్థితుల్లో నా సర్వశక్తులూ ఒడ్డి ఈ గడ్డ బిడ్డల రుణం తీర్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నా. అందుకే కొండంత విశ్వాసంతో చెబుతున్నా. ఈ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధికి నాదే బాధ్యత అని అన్నట్లుగానే సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తా. ఈ ప్రక్రియలో పాలకవర్గం కూడా పారదర్శకమైన పాలన అందించాల్సి ఉంటుంది. అంతేకాదు.. నాతో పాటు కలిసి రావాల్సి ఉంటుంది. ప్రజల అశలు, ఆశయాలను తీర్చే క్రమంలో.. ఎక్కడైనా మావాళ్లు తప్పులు చేస్తే వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకే ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షించే బాధ్యత తీసుకుంటానని మళ్లీ చెబుతున్నా.. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలూ అవసరం లేదు.

బీజేపీ ఎంపీ బండి సంజయ్ పలు రకాల విమర్శలు చేస్తున్నారు కదా? దీనిపై మీ స్పందన?

మంత్రి: కమీషన్లు తీసుకున్నామనీ, అక్రమాలు చేస్తున్నామంటూ విమర్శలు చేస్తున్నారు కదా? మేం గతంలో చెప్పాం. ఇప్పుడూ చెబుతున్నాం. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే.. ఏ ఒక్క ఆరోపణనైనా రుజువు చేయమని సవాల్ విసురుతున్నాం. స్మార్ట్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర మంత్రులకు పలు లేఖలు రాశారు. వారు కూడా ఒక ఎంపీయే కదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? ఆయన చేసిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదో చెప్పాలి. అంతేకాదు.. కేంద్ర మంత్రి కిషన్ స్వయంగా స్మార్ట్ పనుల సమావేశం కలెక్టరేటులో నిర్వహించి, సమీక్షించి గ్రీన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బండి సంజయ్ కూడా ఉన్నారు కదా? ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలి. ఆయన ఫిర్యాదుల వెనుక వాస్తవాలు ఏమిటో ప్రజలు గమనించాలని కోరుతున్నా. ఇదే కాదు.. ఆర్టీసీ కార్మికుడు బాబు చావును కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించారు.

ఆ తదుపరి ఏ ఒక్క రోజైనా ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారా? ప్రజలకు వివరించాలి. బాబు దహన సంస్కారాల తదుపరి ఆ ఇంటికి వెళ్లి కనీసం పలుకరించారా? చెప్పాలి. సదరు కుటుంబాన్ని ఆదుకున్నది టీఆర్ ప్రభుత్వం అవునో కాదో.. ఆ కుటుంబాన్ని అడిగితే తెలిసిపోతుంది. మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు బండి సంజయ్ కమీషన్లు తీసుకున్నారనీ.. ఆ నిజాన్ని మహాశక్తి దేవాలయంలో నిరూపిస్తామని కొంత మంది అప్పట్లో సవాల్ విసిరితే... అక్కడికి వెళ్లకుండా జారుకున్నది సంజయ్ కాదా? చెప్పాలి. అంతేకాదు, ఎంపీగా ఎన్నికై తొమ్మిది నెలలు అవుతోంది. నగరాభివృద్ధికి కనీసం ఒక్క రూపాయైనా తెచ్చారా? చెప్పాలి. నిధులు తేకపోగా.. అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా తన లెటర్ ప్యాడ్ ఫిర్యాదులు చేసి.. అడుగడుగునా అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? చెప్పాలి. ఇవేకాదు.. ఎన్నికలు రాగానే.. ఏదో ఒక సంఘటన సృష్టించుకోవడం.. దానిని సెంటిమెంట్ మలిచి ఓట్లు రాబట్టాలని ప్రయత్నించడం ఆయనకు అలవాటు. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలను లోతుగా గుర్తించండి. అవకాశవాద రాజకీయాలు.. సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ నగరాభివృద్ధి కోసం పాటు పడే టీఆర్ ఓటు వేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా.
logo