మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Oct 18, 2020 , 22:55:55

పాతబస్తీలో దారుణం..యువతి హత్య

పాతబస్తీలో దారుణం..యువతి హత్య

చార్మినార్: పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమించి ఎందుకు ముఖం చాటేశావని ప్రశ్నించిన ప్రియురాలిని ఓ ప్రియుడు తన సోదరుడితో కలిసి కడతేర్చాడు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌ఖేడ్‌ ప్రాంతానికి చెందిన భాదిత కుటుంబం కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి ఆసిఫ్‌నగర్‌ప్రాంతంలోని దత్తాత్రేయ నగర్‌లో నివసిస్తున్నారు. రాధిక(24)  ప్రస్తుతం మహ్మాత్మాగాంధీ యూనివర్సీటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. అలాగే, హైటెక్‌సిటిలోని ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తున్న పీపుల్స్‌ ఫర్‌ యానిమల్‌ సంస్థలో సభ్యురాలుగా కొనసాగుతూ మూగజీవాలపై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఓల్డ్‌సిటీలోని రెయిన్‌బజార్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ముస్తాఫాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే, కొన్నిరోజులనుంచి సయ్యద్‌ ముస్తాఫా రాధికతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. రాధిక ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆమె శనివారం రాత్రి సమయంలో రెయిన్‌బజార్‌ ప్రాంతంలోని నిందితుడి ఇంటికి వచ్చింది. 

ముస్తాఫాను నిలదీసింది. దీంతో అతడి సోదరుడు రాధికతో వాగ్వాదానికి దిగాడు. ముస్తాఫాకూడా సోదరుడితో కలిసి రాధికపై దాడికి పాల్పడుతూ వెళ్లిపోవాలని హెచ్చరించారు. స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదంటూ అక్కడే భీష్మించుకు కూర్చున్న రాధికపై ముస్తాఫా, అతడి సోదరుడు సయ్యద్‌ జమీల్‌ కత్తితో దాడిచేశారు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న రెయిన్‌బజార్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భాదితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ఆనంద్‌ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారని వెల్లడించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo