చెన్నై: ప్రస్తుతం ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player) రూల్ ఓ చర్చనీయాంశమైంది. ఆ రూల్‌పై విమర్శలు వస్తున్నాయి. కానీ కొందరు సీనియర్లు మాత్రం ఆ రూల్‌ను సమర్థిస్తున్నారు. మాజీ కోచ్ రవిశాస్త్రి, స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఆ రూల్‌ను సమర్థించారు. ఇంపాక్ల్ ప్లేయర్లు ఉండడం వల్ల మ్యాచ్‌లను చాలా క్లోజ్‌గా ఫినిష్ చేయవచ్చు అన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. నిజానికి గత సీజన్లోనే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టారు. కానీ ఈ ఎడిషన్‌లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్‌రౌండర్ల పాత్ర తగ్గిపోతుందని కొందరు నిపుణులు తెలిపారు.
ఎప్పుడైనా కొత్త రూల్స్ వస్తే, ఆ రూల్స్‌ను వ్యతిరేకించే వ్యక్తులు ఉంటారని శాస్త్రి పేర్కొన్నారు. కానీ 200, 190 స్కోర్లను కూడా ఛేజ్ చేస్తున్న వైనం చూస్తుంటే, అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ల రూల్‌పై పునరాలోచిస్తారని శాస్త్రి తెలిపారు. కాలంతో పాటు గేమ్‌లో మార్పులు ఉంటాయని శాస్త్రి తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిదే అని, ఇతర క్రీడల్లోనూ మార్పులు జరుగుతున్నాయని, ఈ రూల్ వల్ల మ్యాచులు చాలా టైట్‌గా ఫినిష్ అవుతున్నట్లు శాస్త్రి తెలిపారు.
అశ్వినికి చెందిన యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పర్మనెంట్ కాదు అని, దాన్ని ప్రయోగాత్మంగా మాత్రమే వాడుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. ఆ రూల్ వల్ల ఇద్దరు భారతీయ క్రికెటర్లకు ఒకే మ్యాచ్‌లో ఆడే ఛాన్సు వస్తుందని ఆయన అన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్‌లు వ్యతిరేకించారు. ఆ రూల్‌పై వాళ్లు నిరుత్సాహాన్ని ప్రదర్శించారు.
ఆ రూల్ ఆల్ రౌండర్ల ఎదుగుదలను దెబ్బతీస్తుందని, ఎందుకంటే క్రికెట్ 11 మంది ఆటగాళ్లతో ఆడుతారని, 12 మందితో కాదు అని ఇటీవల రోహిత్ తెలిపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు తానేమీ అభిమానిని కాదు అని, ఆటలో మజా రావడం కోసం పెద్ద మార్పును చేయడం సరికాదు అని రోహిత్ పేర్కొన్నాడు.