ముంబై: 2026 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకున్నది. మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియా సొంతం చేసుకోవడం చరిత్రాత్మకం. తాజా టోర్నీకి టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir) తన బాధ్యతలు నిర్వర్తించాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఇండియన్ జట్టును గంభీర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. వాస్తవానికి గంభీర్ కోచింగ్ శైలిలో విమర్శలు వచ్చినా.. అతను మాత్రం తన వ్యూహాన్ని మార్చలేదు. అభిషేక్ లాంటి బ్యాటర్‌కు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాడు. కీలకమైన దశల్లో జట్టులో మార్పు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచిన సంజూ శాంసన్‌ను సరైన సమయంలో తుది జట్టుకు ఎంపిక చేశాడు. ఆటగాళ్లకు అధునాతన మెళకువల్ని నేర్పుతూ.. ఇండియన్ టీమ్‌ను పటిష్టంగా తీర్చిదిద్దాడు. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్పరెన్స్‌లో గంభీర్ మాట్లాడు. వరల్డ్‌కప్‌ను ఇద్దరు మాజీ క్రికెటర్లకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.
సోషల్ మీడియా కామెంట్లు చేసే వారి కోసం తన బాధ్యత వహించడం లేదని, కానీ ఛేంజ్ రూమ్‌లో ఉన్న 30 మంది కోసం బాధ్యతతో పనిచేసినట్లు గంభీర్ తెలిపాడు. ఓ జట్టు ఎంత ఉత్తమంగా ఉంటుందో.. కోచ్ కూడా అలాగే ఉంటారని, ఆటగాళ్లనే తనను కోచ్‌గా మార్చేశారని గంభీర్ అన్నాడు. అయితే ఈ సందర్భంగా తన సీనియర్లను గుర్తు చేసుకున్నాడు. 2024లో భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో కోచ్‌గా ఉన్న ద్రావిడ్‌ను గంభీర్ గుర్తు చేశాడు. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా గుర్తు చేశాడు. ఈ ట్రోఫీని ద్రావిడ్, లక్ష్మణ్‌కు అంకితం ఇవ్వనున్నట్లు గంభీర్ చెప్పాడు. జట్టును ఓ దశకు తీర్చుకువచ్చినందుకు రాహుల్ ద్రావిడ్‌కు.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్‌కు ఈ ట్రోఫీ దక్కుతుందన్నట్లుగా గంభీర్ తెలిపాడు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఐసీసీ చైర్మెన్ జేషాకు కూడా థ్యాంక్స్ చెప్పాడు గంభీర్. తన వల్ల అజిత్ అగార్కర్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కానీ అతను చాలా హుందాగా వ్యవహరించినట్లు తెలిపాడు. కివీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు కోల్పోయిన సమయంలో జేషా తనకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చినట్లు చెప్పాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇండియా 96 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 రన్స్ చేసింది. అయితే చేజింగ్‌లో కివీస్ కేవలం 159 రన్స్ మాత్రమే చేసి చేతులెత్తేసింది.
ఓడిపోతామన్న భయాన్ని వదిలేయాలని, నిర్మాణాత్మకంగా క్రికెట్ ఆడాలని, 120 పరుగులకే ఆలౌటైనా పర్వాలేదు, కానీ ధైర్యంగా ఆడాలని, ఆ ధైర్యంతోనే సెమీస్, ఫైనల్స్‌లో వరుసగా జట్టు 250 పరుగులు స్కోరు చేసినట్లు కోచ్ గంభీర్ తెలిపాడు. తనతో పాటు కలిసి పనిచేసిన సూర్యకుమార్‌ను కూడా గంభీర్ ప్రశంసించాదడు. తన జాబ్‌ను సూర్య సులువుగా మార్చేశాడని, అతనో నాయకుడని, ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలని, వ్యక్తిగత మైలురాళ్లను కాదన్నారు. ఎన్నో ఏళ్లు వ్యక్తిగత మైలురాళ్లను సెలబ్రేట్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిగత సంబరాలను ఆపేయాలని గంభీర్ అన్నాడు.
Leading the way to World Cup glory 🏆
Champions together 🤝#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | @GautamGambhir | @surya_14kumar pic.twitter.com/u4575uU0oW
— BCCI (@BCCI) March 8, 2026