Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నెల ఆగస్టు వచ్చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో సందడి నెలకొంటుంది. ఈసారి కూడా అభిమానులు ఎస్ఎస్ఎంబీ మంత్ పేరుతో సెలబ్రేషన్స్ ప్రారంభించగా, అందరి దృష్టి ఇప్పుడు ఒకే విషయంపై ఉంది.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా నుంచి ఏదైనా ప్రత్యేక అప్డేట్ వస్తుందా అని? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. అడ్వెంచర్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది.
‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచవ్యాప్త విజయానంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్, ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపించనున్నట్లు సమాచారం. చిత్ర బృందం ఇప్పటికే సినిమా షూటింగ్లో కీలక భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మరికొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా లుక్ గోప్యంగా ఉండేలా రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందుకే మహేష్ బాబు ఇటీవల కాలంలో పబ్లిక్ ఈవెంట్లకు కూడా చాలా తక్కువగా హాజరవుతున్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పోస్టర్, టీజర్ లేదా గ్లింప్స్ విడుదల చేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ‘వారణాసి’ నుంచి ప్రత్యేక అప్డేట్ ఉంటుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈసారి కూడా ఫస్ట్ లుక్, పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ విడుదల చేస్తారా? లేక మరికొంత సమయం వేచి చూడాలని చెబుతారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.ఈ చిత్రంలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై ఆమె ఈ సినిమా గురించి, రాజమౌళి విజన్ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘వారణాసి’పై గ్లోబల్ మార్కెట్లో కూడా మంచి బజ్ ఏర్పడుతోంది.