MK Stalin : డీఎంకే అధినేత (DMK chief), తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. టీవీకే (TVK) మహిళా అభ్యర్థిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. అధికార టీవీకే సహా పలు పార్టీల నేతలు స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. స్టాలిన్ ఇంత చవకగా మాట్లాడి ఉండాల్సింది కాదని అంటున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యభామ అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీచేసి ధారాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు. అనంతరం ఆ స్థానానికి రాజీనామా చేసి, అధికార టీవీకేలో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె ధారాపురం నుంచి టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఆమె డబ్బులకు ఆశపడి పార్టీ ఫిరాయించారని ఆరోపించారు.
సత్యాన్ని పాటించని ఆమె సత్యభామ కాదని, ‘సూట్‌కేస్’ భామ అని స్టాలిన్ విమర్శించారు. ఈ సందర్భంగా అనుచిత పదజాలంతో స్టాలిన్ విమర్శలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. స్టాలిన్ వ్యాఖ్యలను తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. దళితురాలు అనే కారణంతోనే తమ మహిళా అభ్యర్థిపై స్టాలిన్ బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
డీఎంకే నేతలకు మహిళలపట్ల గౌరవం లేదని మండిపడ్డారు. గతంలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ క్రమంలో ఆ మధ్య విజయ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.